రాజకీయాలలో జిత్తులమారిగా పేరుగాంచిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, రాజకీయాలను పక్కనబెడితే మంచి మానవతావాదిగా కూడా వ్యవహరిస్తారని ఈరోజు నిరూపించారు. తల్లి తండ్రుల చేతిలో ఇంతకాలం చిత్రహింసలకు గురయిన ప్రత్యూషని ఇంతకు ముందు హామీ ఇచ్చినట్లుగానే తన ఇంటికి తీసుకువెళ్ళి ఆమెతో కలిసి భోజనం చేసారు. ఆమె ఎంతవరకు చదువుకోదలిస్తే అంతవరకు తానే చదివిస్తానని, ఆ తరువాత ఆమెకు తగిన వాడిని చూసి తనే ఆమె పెళ్లి కూడా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆమె బ్యాంక్ ఖాతాలో రూ.5లక్షలు జమా చేసారు. ఆమెను కూడా తన కుటుంబ సభ్యులతో బాటు తన ఇంట్లోనే ఉంచుకోవాలని ఆయన భావించినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను హాస్టల్లో చేర్చబోతున్నారు. ఆమె ఆరోగ్యం, చదువు, ఇతర అవసరాను అన్నిటినీ సంబంధిత అధికారులు చూసుకోవాలని ఆదేశించారు. ఆమెకు ఎప్పుడు తనతో మాట్లాడాలని ఉన్న నేరుగా ఫోన్ చేసి మాట్లాడమని తన ఫోన్ నెంబరు కూడా ఆమెకిచ్చారు. ఆమెకి ఎప్పుడు తన ఇంటికి రావాలన్నా వచ్చి తన కుటుంబ సభ్యులతో గడపవచ్చని ప్రత్యూషకి చెప్పారు. నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంతగా స్పందించనవసరం లేదు. కానీ మానవతా దృక్పధంతో ఆయన స్పందించిన తీరుని చూసి హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. మంత్రులు, అధికారులు అందరూ కూడా ఆయనని ఆదర్శంగా తీసుకొని అటువంటి మానవతా దృక్పధం అలవరుచుకొంటే ఎంత బాగుంటుందో కదా! హాట్స్ ఆఫ్ టు కేసీఆర్!