ఆంద్ర పాలకుల చేతిలో దోపిడీకి గురవుతున్న తెలంగాణాను, ప్రజలను, సహజ వనరులను రక్షించుకోనేందుకే తెలంగాణా రాష్ట్రం అవసరమని దాని కోసం పదేళ్ళపాటు పోరాడి చివరికి తెలంగాణా సాధించుకొన్నారు కేసీఆర్. తెలంగాణా ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్, బంగారి తెలంగాణా కోసం ఆ భారం తనే వహిస్తానంటూ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొన్నారు. ఆ దిశలో చాలా ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. అందుకు ఆయనను అభినందించాల్సిందే. కానీ, తన బంగారి తెలంగాణా ఆశయాన్ని దెబ్బతీసే చీప్ లిక్కర్ ని ప్రవేశపెట్టాలని నిశ్చయించుకొని ప్రజల నుండి కేసీఆర్ ప్రతిపక్షాల నుండి విమర్శలు మూటగట్టుకొంటున్నారు.
రాష్ట్రాభివృద్ధికి అది తోడ్పడుతుందని ఎవరూ చెప్పలేరు. కానీ ఆయన తన మాటకారితనంతో దాని వలన పేద ప్రజలకు చాల మేలు జరుగుతుందని వాదిస్తున్నారు. ప్రమాదకర రసాయనాలతో తయారుచేస్తున్న గుడుంబా సేవించడం వలన రాష్ట్రంలో అనేకమంది పేద ప్రజలు చనిపోతున్నారు కనుక, దాని స్థానంలో సురక్షితమయిన ఈ చీప్ లిక్కర్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొంటూ ఆయన తన నిర్ణయాన్ని సమర్దించుకొంటున్నారు. గుడుంబా ప్రమాదకరమని ఆయన భావిస్తే దానిని అరికట్టేందుకు తన చేతిలో ఉన్న బలమయిన ప్రభుత్వ యంత్రాంగాన్ని, పల్లెపల్లెకు విస్తరించి ఉన్న తన తెరాస శ్రేణులను ఉపయోగించుకోవచ్చును. కానీ ఆ పని చేయకుండా చీప్ లిక్కర్ మీద దొరికే ఇబ్బడిముబ్బడి ఆదాయం కోసం ఆశపడుతూ తను ఏ నిరుపేద ప్రజలకయితే మేలు చేస్తున్నానని చెపుతున్నారో వారి జీవితాలనే దానికి పణంగా పెట్టాలనుకోవడం చాలా దురదృష్టకరం.
తెలంగాణా రాష్ట్రం దేశంలోనే రెండవ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పుకొనప్పుడు మళ్ళీ ఈ చీప్ లిక్కర్ మీద వచ్చే డబ్బుకి కక్కుర్తి పడటం దేనికో తెలియదు. ఎయిడ్స్ మహమ్మారి సోకుతోందని దానికి విరుగుడుగా మరేదో వ్యాధిని ఒంట్లోకి ఎక్కించుకొమంటే ఎలాగుతుందో ఇదీ అలాగే ఉంది. ప్రజలను మద్యానికి, మత్తుమందులకు, వ్యసనాలకి బానిసలు కాకుండా నిరుత్సాహపరచవలసిన ప్రభుత్వాలే ఈవిధంగా చీప్ లిక్కర్ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనుకోవడం చాలా దారుణం.
అనేక దశాబ్దాలుగా తెలంగాణా దోపిడీకి గురయిందని చెపుతున్నప్పుడు, రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పధంలో నడిపిస్తూ, రాష్ట్ర ప్రజలందరినీ అందుకు కార్యోన్ముఖలను చేయాలి. కానీ ఈవిధంగా మద్యానికి బానిసలుకమ్మని ప్రభుత్వమే ప్రోత్సహించడం చాలా తప్పు. ఇప్పుడు తెలంగాణా ప్రజలకి కావలసింది చీప్ లిక్కర్ కాదు. బక్క చిక్కిన రైతన్నకు పంటలు పండించేందుకు నీళ్ళు, ఎరువులు, ఆర్ధిక సహాయం కావాలి. నేతన్నల మగ్గాలు కదిలేందుకు ప్రభుత్వ సహాయం కావాలి. పరిశ్రమలకు కోతలు లేని విద్యుత్ కావాలి. బీడీ కార్మికుల జీవితాలలో వెలుగులు నింపాలి. ఉన్నదంతా అమ్ముకొని అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్న మెహబూబ్ నగర్, కరీమ్ నగర్ యువతకు తమ దరిద్రం, అప్పుల బాధల నుండీ బయటపడేందుకు ఉద్యోగాలు కావాలి. దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ వ్యాధుల భారిన పడుతున్న నల్గొండ ప్రజలకు త్రాగేందుకు సురక్షితమయిన గ్రుక్కెడు నీళ్ళు కావాలి. ఇలాగ చెప్పుకొంటూపోతే దీనికి అంతే ఉండదు. ఇన్ని సమస్యలని పరిష్కరించాల్సిన బాధ్యత తన మీద ఉండగా కేసీఆర్ చీప్ లిక్కర్ ప్రవేశ పెట్టడం చాలా అత్యవసరమన్నట్లుగా వాదించడాన్ని తెలంగాణా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
తరచూ ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, దానిపై ప్రతిపక్షాలు, కోర్టుల చేత మొట్టికాయలు వేయించుకొని వెనక్కి తగ్గడం “తెలంగాణా పిత”కి శోభనీయదు. బంగారి తెలంగాణాయే తన లక్ష్యం అయినప్పుడు ఆ దిశలోనే ముందుకు సాగిపోతే ఎవరూ ఇలాగ వేలెత్తి చూపరు. పైగా అందరూ మద్దతు ఇస్తారు కూడా. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవడం వలన తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించి మొండిగా ముందుకు వెళితే మున్ముందు ఇంతకంటే అవమానకరమయిన పరిస్థితులే ఎదుర్కోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు. తెలంగాణా సాధించినందుకు ఇంతకు ముందు ప్రజల చేత నీరాజనాలు అందుకొన్న కేసీఆర్, ఇప్పుడు అదే ప్రజలు ఆయన ఫోటోకి మద్యంతో అభిషేకం చేస్తున్న ఘటనలు చూస్తే మున్ముందు పరిస్థితులు ఏవిధంగా ఉండబోతున్నాయో అర్ధం అవుతుంది. కనుక ఆయన చీప్ నిర్ణయంపై పునరాలోచించుకొంటే మంచిది.