ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఒక ముగింపు లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వెనక్కి తగ్గారో, ముందుకెళ్లారో అనే విశ్లేషణ కంటే… సమస్యకు ఒక పరిష్కారమైతే చూపించారు. అయితే, సీఎం కేసీఆర్ మనసు మారిందీ అంటే.. అది తాము చేసిన ప్రయత్నం ఫలితమే అంటూ భాజపా క్లెయిమ్ చేసుకోవడం విడ్డూరంగా ఉంది. ఎంపీ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం ఒత్తిడి పెంచుతుందని భావించారు కాబట్టే, ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి వెనక్కి తగ్గారన్నారు! ప్రైవేటు రవాణా సంస్థలతో ముందుగా రహస్య ఒప్పందాలు చేసుకున్నారనీ, భాజపా రంగంలోకి దిగితే అవన్నీ బయటపడతాయని సీఎం భయపడ్డారన్నారు. కేంద్రం జోక్యం ఖాయమని ఆయన గ్రహించారన్నారు! త్వరలో మున్సిపల్ ఎన్నికలున్నాయి కాబట్టే ముఖ్యమంత్రి వెనక్కి తగ్గారన్నారు సంజయ్. భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఇదే తరహాలో క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే వ్యాఖ్యలు చేశారు.
ఆర్టీసీ విషయంలో భాజపాకి భయపడాల్సిన అవసరం కేసీఆర్ కి లేదు. ఎందుకంటే, కేంద్రమే ఆర్టీసీని ప్రైవేటీకరించొచ్చు అనే చట్టం తీసుకొచ్చింది. దానికి అనుగుణంగానే ప్రైవేటీకరణపై ఆయన మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి, అనూహ్యంగా కేంద్రం జోక్యం చేసేసుకుని ఏదో చేసేస్తుంది అనే పరిస్థితి ఎప్పుడూ లేదు. అయితే కేసీఆర్ ఎలా మారారూ అంటే… అదేదో భాజపా ప్రయత్నం కానే కాదు. సమ్మె ప్రారంభమైనప్పుడు… పండుగ సమయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే అసంతృప్తి ఆర్టీసీ పట్ల ప్రజల్లో ఏర్పడింది. కానీ, తరువాత కార్మికులపై లాఠీ ఛార్జ్ లు, మహిళలు కన్నీళ్లు పెట్టుకోవడాలు, ముఖ్యమంత్రి కఠిన వైఖరీ… ఇవన్నీ ప్రజల్లో సింపథీ పెంచాయి. వీటిపై కేసీఆర్ కూడా సమీక్షించుకునే ఉంటారు. అయితే, అప్పుడే ఈ సానుకూల నిర్ణయమేదో ప్రకటించొచ్చు కదా అనొచ్చు! అలా చేస్తే, ఇప్పుడీ భాజపా నేతలు అన్నట్టుగా కేంద్రానికి భయపడ్డారనో, కోర్టుకి భయపడి తోక ముడిచారనో అభిప్రాయం కలుగుతుంది. ఆ అవకాశం ఇవ్వకూడదనే కాస్త తాత్సారం చేసి ఉండొచ్చు. కేసీఆర్ ఎవరికో భయపడో ఒత్తిళ్లకు లొంగో నిర్ణయాలు మార్చుకోరు, ఆయన మనసు మార్చితే మార్చుకుంటారు అనే అభిప్రాయం ఇప్పుడు కలుగుతోంది కదా! ఇదీ కేసీఆర్ స్ట్రాటజీ.
ఇదే వాస్తవం… అంతేగానీ, దీన్లో భాజపా నేతలు పెంచిన ఒత్తిడంటూ ఏమీ లేదు. సరే, భాజపాకి నిజంగానే ఆర్టీసీ కార్మికులంటే అంత ప్రేమే ఉంటే… కనీసం ఇప్పుడైనా ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చెయ్యొచ్చు. కేంద్రం తెచ్చిన మోటారు వాహన చట్టంలో ప్రైవేటీకరణకు ఆస్కారం లేదంటూ సవరణ తీసుకుని వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావొచ్చు. ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందంటూ కోర్టులో వాదించారు కదా! ఆ వాటా ప్రకారమే ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రయత్నించొచ్చు. కార్మికులకు మేలు చేయాలని అనుకుంటే భాజపాకి చాలా అవకాశాలే ఉన్నాయి. అవన్నీ మాట్లాడకుండా… కేంద్రం జోక్యం చేసుకుంటుందని కేసీఆర్ భయపడ్డారు అంటూ మాట్లాడటం దిగజారుడు రాజకీయమే అవుతుంది.