ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తుది అఫిడవిట్ దాఖలు చేసిందనే చెప్పాలి! మేం చెప్పాలనుకున్న చివరి మాట ఇదే అన్నట్టుగా స్పందన ఉంది. కార్మికులు సమ్మె చట్ట విరుద్ధమంటూ మరోసారి కోర్టుకు తెలిపింది. సమ్మె చేస్తామంటూ నోటీసులు ఇవ్వడమే చట్ట విరుద్ధమంటూ కోర్టుకు చెప్పారు. సమ్మెను చట్ట విరుద్ధమని ఎవ్వరూ ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదనీ, పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఇలాంటి నిరసన ప్రారంభించడమే చట్ట విరుద్ధం అవుతుందని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
కార్మికులతో చర్చలు సాధ్యం కాదనే మరోసారి కోర్టుకు చెప్పేశారు! ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారమై కార్మిశాఖ మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నిస్తే యూనియన్ నాయకులు స్పందించలేదనీ, కొందరు యూనియన్ నేతలు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కార్మికులతోపాటు ప్రజలనూ ఇబ్బంది పెడుతున్నారంటూ కోర్టుకు తెలిపారు. వీరికి ప్రతిపక్ష పార్టీల నాయకులు తోడయ్యారనీ, వారి ద్వారా ఆర్టీసీని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. విలీనం డిమాండ్ తాత్కాలికంగా మాత్రమే వదులుకున్నామని చెబుతున్నారనీ, భవిష్యత్తులో దాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే చర్యలు చేపట్టరని గ్యారంటీ ఏముందని కోర్టుకు చెప్పారు. ఇప్పటికిప్పుడు కార్మికులు స్వచ్ఛందంగా విధుల్లోకి చేరతామని వచ్చినా, వారిని కొనసాగించడంపై ఆర్టీసీకి కొన్ని ఇబ్బందులున్నాయంటూ ఎండీ కోర్టుకు తెలిపారు. త్వరలోనే కోర్టు తమ నిర్ణయాన్ని వెలువరించాలని కోరారు.
ఆర్టీసీ సమ్మె విషయంలో అన్ని వైపుల నుంచీ నిస్సహాయతే కనిపిస్తోంది! ప్రతిపక్షాల నిరసనలు, కార్మికుల నిరవధిక సమ్మె, నాయకుల దీక్షలు… ఇలా ఎన్ని చేసినా ఏం చేసినా ప్రభుత్వం పంతం వీడటం లేదు. హైకోర్టు ఆదేశించినా, సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని సూచించినా, కార్మికులు వారి ప్రధాన డిమాండ్ పక్కనపెట్టినా… ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ అఫిడవిట్ దగ్గరకి వచ్చేసరికి… సమ్మె చట్ట విరుద్ధమని వారే ప్రకటించేసుకున్నట్టుగా ఉంది. యూనియన్ల నాయకులదే తప్పు, వారికి అండగా నిలుస్తున్న పార్టీలదే తప్పు అని తేల్చేసింది. గడచిన 40 రోజులుగా కార్మికుల సమ్మె, ఆత్మహత్యలు, జీతాలు లేకపోవడాలు, ప్రజల ఇబ్బందులు… ఇవేవీ ప్రభుత్వం పట్టించుకున్నట్టుగా లేదు. మేం చెప్పినట్టు వినలేదు, అందుకే ఈ పరిస్థితి అంటూ నెపాన్ని యూనియన్ల నేతలపై నెట్టేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇక, సోమవారం నాడు కోర్టు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.