తెలంగాణ కాంగ్రెస్ నేతలు రోజురోజుకీ బయటపడిపోతున్నారు..! ఆలూ లేదూ చూలూ లేదు అన్నట్టుగానే… వచ్చే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అధికారం మీద ఆశలు పెట్టేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికి తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే తాను రేసులో ఉన్నానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటికి రెండుసార్లు చెప్పారు. బయటకి చెప్పకపోయినా… అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నాను కాబట్టి, ఆ పదవి తనకే దక్కుతుందన్న ధీమాలో ఉత్తమ్ కుమార్ ఉండటం సహజం! ఇప్పుడు.. మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇదే ఆశతో ఉన్నట్టు అనిపిస్తోంది. ఇతర నాయకుల్లా ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా… బాహుబలి పోలికతో పరోక్షంగా అవే సంకేతాలు ఇచ్చారు!
వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి ఒక బాహుబలి అవసరం అని ఆయన వ్యాఖ్యానించారు! ఇంతకీ ఆ బాహుబలి ఎవరౌతారని ఆయన్ని ప్రశ్నిస్తే… ఎవరైతే కథను ముగిస్తారో వారే అవుతారని తెలివిగా సమాధానం చెప్పారు. ఇదే సమయంలో… రాజకీయాల్లో తన అనుభవం గురించి కూడా చెప్పుకున్నారు. పొలిటికల్ కెరీర్లో ఆదర్శవంతంగా ఉంటున్నానని తనకు తానే కితాబిచ్చుకున్నారు. నిజానికి… తెలంగాణ బడ్జెట్‌పై జానారెడ్డి బాగానే స్పందించారని చెప్పాలి! బీసీ వరాల బడ్జెట్ అంటూ కేసీఆర్ సర్కారు ప్రచారం చేసుకుంటూ ఉంటే… వాస్తవాలను వక్రీకరించారంటూ జానా ఆరోపించారు. మూరెడు బారెడు అన్నట్టుగానే కేసీఆర్ బడ్జెట్ లెక్కలున్నాయనీ.. పెరిగిపోతున్న అప్పుల సంగతి ఏంటంటూ సభలో నిలదీశారు. కాంగ్రెస్ తరఫున ఇతర సభ్యులెవ్వరూ పెద్దగా మాట్లాడలేదు. కానీ, ఆ పార్టీ బాధ్యత అంతా తనపై వేసుకున్నట్టుగా జానా ఈసారి మాట్లాడటం విశేషం.
ఇందంతా ఓకే… కానీ, కాంగ్రెస్‌కు కావాల్సిన బాహుబలి తానే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ, తెలగాణలో కాంగ్రెస్ పార్టీ కథ ఏంటో.. దాన్ని ఎలా ముగించాలో కూడా జానా చెప్పి ఉంటే బాగుండేది. ఈ కథను ముగించేందుకు ఇంకెవరైనా వస్తారని జానా ఆశలు పెట్టుకున్నారేమో..! మొత్తానికి, పరోక్షంగానైనా తన మనసులోని ఆలోచల్ని బయటకి చెప్పే ప్రయత్నం చేసినట్టు అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఇకపై తాను పార్టీ సభ్యులతోనే మాట్లాడిస్తానని చెబుతూ.. అందరి బాధ్యత తాను తీసుకుంటున్నట్టుగా వ్యాఖ్యానించడం విశేషం..! మొత్తానికి, టి. కాంగ్రెస్ బాహుబలి ఎవరౌతారో చూడాలి.