తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది తప్పా? ఒప్పా? అనే విషయం పక్కన పెడితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, రకరకాల కార్పొరేషన్ల ఉద్యోగులకు భయం కలిగించాడనేది మాత్రం స్పష్టం. కేసీఆర్ తలచుకుంటే ఏమైనా చేయగలడనే అభిప్రాయం ప్రజల్లోకి, ఉద్యోగుల్లోకి బలంగా వెళ్లిపోయింది. ప్రతిపక్షాలు ఆయన్ని ఏమీ చేయలేవని, అపోజిషన్ పార్టీల మద్దతు కోరితే లేదా వారి అండతో పోరాటం చేద్దామనుకుంటే అసలుకే ఎసరు వస్తుందనేది అందరికీ అర్థమైపోయింది. కేసీఆర్ ఆర్టీసీ సమ్మెను డీల్ చేసిన విధానమే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. కేసీఆర్ కోర్టుకు కూడా భయపడరని ఇప్పుడు తెలిసిపోయింది. కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందని భయపడే కేసీఆర్ దిగివచ్చి ఆర్టీసీ కార్మికులకు వరాలు ఇచ్చాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇంకా కొందరు కాషాయ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకున్నారు.
అలాంటి భయాలు కేసీఆర్‌కు ఏమీ లేవు. తాను ఉద్దేశపూర్వకంగానే కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించానని కేసీఆర్ స్పష్టంగా చెప్పిన తరువాత ఇంకా ఎవరికైనా భయపడేది ఏముంటుంది? నిజానికి ఆయన చేయలగలిగితే రూట్ల ప్రైవేటీకరణ చేయగలడు. ఎందుకంటే హైకోర్టు ఆ పని చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం కొత్తగా చేసిన చట్టంలోనూ ఆ వెసులుబాటు ఉంది. తాను చెప్పినట్లే ఆర్టీసీ కార్మికులను పూర్తిగా అణిచేసివుంటే ప్రజల్లో వ్యతిరేకత పెరిగేదని, అది రాబోయే మన్సిపల్ ఎన్నికల్లోనే కాకుండా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించేదని కేసీఆర్ భావించాడు. తనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ప్రచారం చేస్తాయి. అందుకే కార్మికులను ఆయన ఎంత తీవ్రంగా వేధించాడో, అంతకంటే ఎక్కువగా వరాలు కురిపించాడు.
దీంతో ఒక్కసారిగా మంచివాడుగానే కాదు, దేవుడిగా మారిపోయాడు. ఇప్పుడాయన్ని విశాల హృదయుడిగా పొగుడుతున్నారు. ఇంత మంచి పనులు కేసీఆర్ తప్ప మరెవరూ చేయరని భావిస్తున్నారు. నిజానికి ఆర్టీసీ కార్మికులకు ఇంతకు మించి ఎవరైనా ఏం చేస్తారు? అనే ప్రశ్నించే పరిస్థితి కల్పించాడు. ఆర్టీసీ సమ్మె తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, ఇతర కార్పొరేషన్లలోని ఉద్యోగులకు ఒకటి అర్థమైంది. తాము ఏదైనా సాధించుకోవాలంటే సమ్మెలు చేస్తే లాభం లేదని, కేసీఆర్‌ను అభ్యర్థించి ఆయన దయ కలిగే వరకు వేచి ఉండటమే ఉత్తమ మార్గమని అనుకుంటున్నారు.
భక్తులు దేవుడిని ‘మా మీద దయ చూపు..మా కష్టాలు తీర్చు స్వామీ’ అని పాటలు, కీర్తనలు పాడుతూ, స్తోత్రాలు చేస్తూ వేడకుంటూ ఉంటారు. కాని వారు దేవుడిపై తిరుగుబాటు చేయరు. సమ్మెకు దిగరు. ఇక నుంచి తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. సమ్మె అంటే ధిక్కారం . దాన్ని తాను సహించనని కేసీఆర్ ఆర్టీసీ సమ్మె ద్వారా సంకేతం ఇచ్చాడు. ఆర్టీసీ కార్మికులకు ఇన్ని వరాలు ఇస్తాడని ఎవ్వరైనా అనుకున్నారా? కార్మికులు కూడా తమ ఉద్యోగాలు నిలబడ్డాయి చాలు అనుకున్నారు తప్ప ఇంత ఇస్తాడని అనుకోలేదు. కేసీఆర్ చెప్పినట్లు యూనియన్లను వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ జేఏసీలోనూ చీలికలు వస్తున్నాయి.
ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. జేఏసీతో తమకిక సంబంధం లేదని సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రకటించింది. మిగతా సంఘాలు కూడా జేఏసీ నుంచి వెళ్లిపోయే అవకాశముంది. ఇక పీఆర్సీ, రిటైర్మెంట్ పెంపు కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ల పరిష్కారంలో జాప్యం జరిగినా వేచి చూడటమే మంచిదని భావిస్తున్నారు. కేసీఆర్ దయ కలిగేవరకు వేచి చూసినట్లయితే కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సమ్మెలు చేయడం అవుట్‌డేటెడ్ వ్యవహారమని, పాలకుల కటాక్షవీక్షణాల కోసం ఎదురుచూడటమే కొత్త ట్రెండ్ అని అనుకుంటున్నారేమో…!