దళిత బంధు అమలుకు తెలంగాణసీఎం కేసీఆర్ టైమ్ ఫ్రేమ్ ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఒకటి, రెండు నెలల్లో హుజురాబాద్‌లో ఉన్న 21వేల దళిత కుటుంబాలకు పథకం అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే మూడు, నాలుగేళ్లలో రాష్ట్రం మొత్తం పథకం అమలవుతుందని స్పష్టం చేశారు. దళిత బంధు పథకం కాదని.. ఓ ఉద్యమం అని స్పష్టం చేశారు. గత ఏడాదే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యమయిందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికీ దళిత బంధు ఇస్తామన్నారు. అయితే వారికి నాలుగో దశలో ఇస్తామన్నారు.
భవిష్యత్‌లో భారత్‌లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 15 రోజుల్లో ఇంకో రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని, దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలని పిలుపునిచ్చారు. విపక్ష పార్టీలపై కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేసారు. దళితబంధు ఇస్తామనగానే కిరికిరిగాళ్లు కొండి పెడుతున్నారని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో ఆందోళనలు చేసినట్లుగా తెలిసిందని.. ఇలా ఆందోళనలు చేయించిన వాళ్లు రూ. పది లక్షలు ఇస్తారా అని కేసీఆర్ ప్రకటించారు. పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయన కేసీఆర్ ధ్వజమెత్తారు.
దళిత బంధు సభ వేదకపై పదిహేను మందికి కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు. నెలా.. రెండు నెలల గడువును కేసీఆర్ నిర్దేశించడంతో ఉపఎన్నికల లోపే హుజూరాబాద్ దళితులందరికీ రూ. పది లక్షలు అందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రూ. ఐదు వందల కోట్లను విడుదల చేసిన కేసీఆర్.. మరో రెండు వేల కోట్లను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కేసీఆర్ సభకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు.