అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీపై ఎటువంటి ప్రకటన చేయకుండా రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను కూడా చాలా నిరాశపరిచారు. రాష్ట్ర ప్రజల ఆదరణ పొందుతున్న నరేంద్ర మోడీ ప్రసంగాన్ని విని పెదవి విరిచిన రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం యుద్ధం చేసే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగానికి జేజేలు పలికారు. ఆయన చూపిన ఒక చిన్న సానుకూల వైఖరికే రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషించినట్లు అది తెలియజేస్తోంది. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించి ఉండి ఉంటే రాష్ట్ర ప్రజలు ఆయనను నెత్తిన పెట్టుకొనే ఉండేవారు. కానీ ఆయన తనకు దక్కిన ఆ అపూర్వకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. కేసీఆర్ చాలా హుందాగా వ్యవహరించి రాష్ట్ర ప్రజల అభిమానం చూరగొన్నారు.
రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సరిగ్గా అదే ముక్క తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారు. కానీ వారిద్దరి హామీలకి వచ్చిన స్పందన పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రజలు తన నుండి ఏమి ఆశిస్తున్నారో ప్రధాని నరేంద్ర మోడీకి ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ ప్రత్యేక హోదా లేదా ప్యాకేజిపై నిర్దిష్టమయిన ప్రకటన చేయకపోవడంతో ఆయన విమర్శలు మూటగట్టుకొని తిరిగివెళ్ళారు. రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి సహకరించడం కేంద్రప్రభుత్వం బాధ్యతే కానీ తెలంగాణా ప్రభుత్వానిది కాదు. అయినప్పటికీ తమ ప్రభుత్వం దానికి సహకరిస్తుందని అని చెప్పి కేసీఆర్ రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని వెళ్ళారు. ప్రధాని ఒక మంచి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకొంటే, కేసీఆర్ దానిని ఎంచక్కగా ఉపయోగించుకొన్నారు. ఆయన రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోయినా రాష్ట్ర ప్రజలు ఏమనుకోరు కానీ ఇక ముందు కూడా ఇదే విధంగా స్నేహపూర్వకంగా ఉంటేచాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకొంటున్నారు.