ఒకప్పుడు బడి పిల్లలు ఆల్జీబ్రా అంటే గుండె గాభరా అనేవారు. కొందరికి లెక్కల సబ్జెక్టు అంటే అంత భయముండేది. కొందరు పిల్లలు లెక్కల్లో పూర్‌గా ఉంటారు. ఇలాంటి పిల్లలను సహజంగానే స్కూల్లో, బయటా చిన్నచూపు చూస్తుంటారు. లెక్కల్లో పూర్‌గా ఉండేవారు మంచి చదువులు చదవలేరనే అభిప్రాయముంది. సామాన్యులకు జీవితాంతం లెక్కలతో కుస్తీ పట్టాల్సిన అవసరం ఉండదుగాని రాజకీయ నాయకులకు ముఖ్యంగా పార్టీ అధినేతకు, ముఖ్యమంత్రి, ప్రధాని పదవుల్లో ఉన్నవారికి లెక్కతో కుస్తీ పట్టక తప్పదు. అయితే ఇవి మామూలు లెక్కలు కాదు. ‘కులాల లెక్కలు ’.
కులం అంటే మరీ మోటుగా ఉంటుందని, బూతు మాటగా ఉంటుందని ‘సామాజిక వర్గం’ అని మర్యాదగా అంటున్నారు. రాజకీయ నాయకులకు కులాల లెక్కలు చాలా ముఖ్యం. ఈ లెక్కల విషయంలో పూర్‌గా ఉంటే రాజకీయాల్లో ఎదగడం, అధినేతలు తమ పార్టీల ను, పదవులను కాపాడుకోవడం కష్టం. ప్రస్తుతం తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కులాల లెక్కలతో కుస్తీ పడుతున్నారు. ప్లస్సులు, మైనసులు చేస్తున్నారు. లెక్క ఎలా చేస్తే రాజకీయ, సామాజిక సమీకరణాలు సరిగ్గా ఉంటాయనేదానిపై కసరత్తు చేస్తున్నారు. ఇంతకీ ఈ కులాల లెక్క గొడవ ఏమిటనే కదా సందేహం. తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు సమయం దగ్గర పడుతోంది. మరి అభ్యర్థులను ఎంపిక చేయాలి కదా.
అభ్యర్థులంటే మరీ యాభై మందో వందమందో కాదండి. జస్ట్…కేవం ఇద్దరు. ఇద్దరేనా? వీరిని సెలెక్ట్ చేయడానికి కులాల లెక్కతో హైరానా పడాలా? అని మనం అనుకోవచ్చు. కాని ఒక పార్టీకి అధినేత, ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌కు ఇదంత సుభం కాదు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు దేన్నయినా కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటారు. ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమంటే చిన్న పని కాదు. అభ్యర్థుల ఎంపిక పైనే భవిష్యత్తు రాజకీయాలు , వచ్చే ఎన్నిక ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఫ్యూచర్ పాలిటిక్స్ భయంతోనే కులాల లెక్కపై అంత గట్టిగా కుస్తీ పడతారు.
అసెంబ్లీలో టీఆర్ఎస్కు బండ మెజారిటీ ఉంది కాబట్టి రాజ్యసభకు ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవడం చాలా వీజీ. కాని ఏఏ సామాజికవర్గాలకు చెందిన వారిని ఎంపిక చేయాలన్నదే ప్రశ్న. ఎందుకంటే ప్రతి సామాజికవర్గం నుంచి టిక్కెట్ల కోసం అధినేతపై ఒత్తిళ్లు ఉంటాయి. అభ్యర్థుల ఎంపికలో కులం ఒక్కటే చూడరు. అభ్యర్థి ఆర్థిక పరిస్థితి కూడా ముఖ్యమే. ప్రస్తుతం కొందరు కుబేరులు రాజ్యసభ టిక్కెట్ కోసం కేసీఆర్ మీద ఒత్తిడి తెస్తున్నారు. ‘నమస్తే తెంగాణ’ ఛైర్మన్ కమ్ ఎండీ దివకొండ దామోదర్‌రావు, ‘మై హోం’ అధినేత జూపల్లి రామేశ్వరరావు నుంచి బాగా ఒత్తిడి ఉంది. వీరిద్దరు కేసీఆర్ సామాజిక వర్గానికి (వెలమ) చెందినవారే.
ఉన్నవి రెండు సీట్లు కాబట్టి చెరో కులానికి ఇవ్వాలి. రెడ్డి-బిసీ, వెలమ-బీసీ, రెడ్డి-ఎస్సీ, వెలమ-ఎస్సీ…ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీఆర్ఎస్కు ఐదుగురు రాజ్యసభ సభ్యులున్నారు. వారిలో ముగ్గురు బీసీలు , ఒక వెలమ, ఒక బ్రాహ్మణుడు ఉన్నారు. ఈ లెక్కనుబట్టి ఇద్దరిని ఎంపిక చేయాల్సివుంటుంది. ఇప్పటికే బీసీలు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈసారి వారిని ఎంపిక చేయకపోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైరవుతున్న డాక్టర్ కేశవరావు బీసీ సామాజికవర్గమే. ఒకవేళ బీసీకి మళ్లీ ఇవ్వానుకుంటే కేశవరావును మళ్లీ నామినేట్ చేస్తారని అనుకుంటున్నారు.
ప్రస్తుతం ఉన్న రాజ్యసభ సభ్యుల్లో సంతోష్ కుమార్ వెలమ. టిక్కెట్లు ఆశిస్తున్న దామోదర్ రావు, రామేశ్వరరావు, కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత వెలమ. రెడ్డికి ఇవ్వాల్సివస్తే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి రడీగా ఉన్నాడు. లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్టు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ పని చేయలేదు కాబట్టి రాజ్యసభకు పరిశీలిస్తారని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ తరపున రాజ్యసభలో ఎస్సీ సభ్యుడు లేడు. కాబట్టి ఒక సీటు అగ్రవర్ణాలకు ఇస్తే మరో సీటు ఎస్సీలకు ఇవ్వచ్చని అంచనా. ఎస్సీల కు రాజ్యసభ ఇవ్వకపోతే మండలికి ఛాన్స్ ఇవ్వచ్చు. రెండు సీట్లలో రెడ్లకు, వెలమలకు ఇస్తారని టీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. మరి కేసీఆర్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.