తెలిసో తెలియకో తెలంగాణ ప్రభుత్వం పట్ల కేంద్రం వివక్ష పూరిత ధోరణిని అనుసరిస్తున్నది అని బలంగా ముద్రపడిపోయింది. భారతీయ జనతా పార్టీకి గత సార్వత్రిక ఎన్నికల్లో అంతగా ఆదరణ చూపించని తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర సర్కారు కూడా అదే తరహాలో ప్రతిస్పందిస్తూ సవతితల్లి ప్రేమను మాత్రమే కనబరుస్తున్నదనే ముద్ర కూడా ప్రజల్లోకి వెళ్లిపోయింది. దీనిని ఈ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మరింతగా హైలైట్ చేసి.. భాజపాకు అంతో ఇంతో నగరంలో ఉండే బలాన్ని కూడా.. మంటగలిపేయడానికి తెరాస కంకణం కట్టుకుని మరీ ప్రచారం సాగిస్తున్నది. దేశంలోనే కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఒక్కసారి కూడా అడుగుపెట్టడానికి ప్రధానికి తీరిక లేకుండాపోయిందా? అనే ప్రశ్నతో భాజపాను ఎంతగా భ్రష్టు పట్టించాలో అంతగానూ చేసేస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పట్ల ఎక్కువ ప్రేమ కురిపిస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు.
ఇవన్నీ సగటు పౌరుడిని.. తెలంగాణ పట్ల భాజపా నేతృత్వంలోని కేంద్రం వివక్షతోనే ఉన్నదనే సంకేతాలను నమ్మేలా చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా.. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలకు ఎంపిక చేసిన తొలి జాబితాను గురువారం నాడు విడుదల చేసింది. ఈ జాబితా తెలంగాణ ప్రియులు భాజపా మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యేలా ఉన్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్మార్ట్ సిటీల తొలి జాబితాను విడుదల చేస్తే అందులో తెలంగాణ నుంచి కనీసం ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. ఈ పాయింటును పట్టుకుని భాజపా సర్కారును తెరాస శ్రేణులు ఒక రేంజిలో తిట్టిపోస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దానికి తగ్గట్లే.. వారు చెబుతున్న వివక్ష నిజమే కదా అని ప్రజలందరూ నమ్మినా ఆశ్చర్యం లేదు!