తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ లేని విధంగా 24 గంటల్లోపే రెండో సారి ప్రెస్‌మీట్ పెట్టారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకూ ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీని చెడామడా తిట్టిన ఆయన .. వారు ఇచ్చిన కౌంటర్లపై మళ్లీ తాను మాట్లాడేందుకు ప్రెస్‌మీట్ పెట్టారు. నాలుగు గంటలకు ప్రారంభించి మరో గంటన్నర సేపు అనర్ఘళంగా మాట్లాడారు. ఇందులో అత్యధికం ఆదివారం చెప్పిన విషయాలే ఉన్నాయి. అయితే కొన్నింటిపై మాత్రం మరింత క్లారిటీగా వివరాలు ప్రకటించారు.
బీజేపీ ధాన్యం కొనాలని తెలంగాణలో టీఆర్ఎస్ ధర్నాలు !
ఆదివారం ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నా చేస్తామన్న ఆయన ముందుగా తెలంగాణలోనే ధర్నాలు చేయాలని డిసైడయ్యారు. రేపు శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ధాన్యం కొనాలనే ధర్నాలుచేస్తామని ప్రకటించారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఉండగా.. ప్రతిపక్షంగా బీజేపీ ఉంది. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ధాన్యం కొంటారో లేదో స్పష్టంగా చెప్పాలని బండి సంజయ్‌కు కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.
ఫామ్ హౌస్ జోలికి వస్తే ఆరు ముక్కలవుతారు !
ప్రెస్మీట్లో కేసీఆర్ ఎక్కువగా ప్రస్తావించిన భయం. బీజేపీకి భయపడబోమని ప్రకటించారు. ఈడీలు, ఐటీ దాడులపై దొంగలు భయపడుతారని తాము కాదన్నారు. తనకు మనీలాండరింగ్, దొంగ వ్యాపారాలు లేవన్నారు. తాము చైనాలో డబ్బులు దాచుకోలేదన్నారు తనది ఫామ్ హౌస్ కాదని.. ఫార్మర్ హౌస్ అని.. దాని జోలికొస్తే ఆరు ముక్కలవుతారని.. బండి సంజయ్‌ను హెచ్చరించారు. దిక్కుమాలిన బెదిరింపులకు ఎవరూ భయపడబోరన్నారు.
త్వరలో 70వేల ఉద్యోగాల భర్తీ.. ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ !
రెండు రోజుల్లో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఉందని ఆ తర్వాత 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం ఏ జిల్లాకి చెందిన వారు ఆయా జిల్లాల్లో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండ్ ప్రకటిస్తామన్నారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌లో వంద శాతం అమలు చేస్తామని వచ్చే మార్చిలోపు ప్రతి నియోజకవర్గంలో వంద మందికి పథకం అమలు చేస్తామన్నారు.
దళితుడ్ని సీఎం చేయకపోయినా ప్రజలు అంగీకరించారు !
ప్రతీ సారి దళితుడ్ని సీఎం చేస్తానని చేయలేదని విపక్షాలు చేస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. 2014 ఎన్నికల ముందు ప్రచారంలో దళితుడ్ని సీఎం చేస్తానన్న మాట నిజమే కానీ.. చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అన్నారు. తామే దళితున్ని ముఖ్యమంత్రి చేయనివ్వలేదని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీయే చెప్పారన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేయకపోయినా ప్రజలు నా నిర్ణయాన్ని స్వాగతించారని చెప్పారు. రెండోసారి కూడా టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు అధికారం కట్టబెట్టారని తేల్చేశారు. ఎక్స్పైర్ అయిన మెడిసిన్ లాగా దళితున్ని సీఎం చేస్తానని చెప్పి చేయలేదని అంటున్నారు, ఆ తర్వాత కూడా ప్రజలు నాకే అధికారం కట్టబెట్టారని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆదివారం బీజేపీ నేతలపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన కేసీఆర్ సోమవారం ఘాటు తగ్గించారు. అయితే రెండో రోజు ఆయన రైతులు, నిరుద్యోగులు, దళితుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను సంతృప్తి పరిచే పరయత్నం చేశారు.