మిర్చి పంటకు మద్దతు ధరపై కేంద్రం ప్రకటన మిలీనియం జోక్ అంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్య ఆ రాష్ట్ర గడసరి వైఖరిని వెల్లడిస్తోంది. మిర్చి పంటను 33వేల టన్నులు క్వింటాలు 5 వేలకు కొనాలని చేసిన ప్రకటన రైతులకు శఠగోపం పెట్టేలా ఉందన్నారు. మార్కెట్‌కు 7లక్షల టన్నుల మిర్చి వచ్చిందనీ, కేంద్ర ప్రకటన వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనమూ లేదనేది ఆయన వాదన. మిర్చి పంట మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వాల పరిథిలోకి రాదని ఆయన అంటున్నారు. వరి ధాన్యం రాష్ట్ర పరిథిలోనిదేననీ, తాము ఇవ్వాల్సినంత ఇచ్చి, వరి, కందులు కొనుగోలు చేశామని తెలిపారు. మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి పంటను కొనడం లేదే అని కూడా హరీశ్ అనడం కేంద్రాన్ని సవాలు చేయడమే. మిర్చి సమస్యను అర్థం చేసుకోవడంలో కేంద్రం విఫలమైందనేది ఆయన అభిప్రాయం. కోల్డ్ స్టోరేజీలకోసం పెట్టిన ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదనీ, ఈ అంశంపై మరోసారి లేఖ రాస్తున్నామనీ హరీశ్ తెలిపారు. పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కుండబద్దలు కొట్టేశారాయన.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్న తరవాత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహారాలు సాగాలి. పాలనలో ఈ రెండింటికీ మధ్య పొరపొచ్చాల వల్ల నష్టపోయేది ప్రజలు తప్ప నాయకులు కాదన్న విషయాన్ని గుర్తెరిగి మెలగాలి. అయినా సరే.. మొదటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరిని అనుసరిస్తున్నట్లే కనిపిస్తూ.. తన పనులను చక్కబెట్టేసుకుంటోంది. డీమానిటైజేషన్ అంశానికి మద్దతు పలుకుదామంటూ చెప్పి, కేసీఆర్ అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేశారు. అందుకు తగ్గట్టుగా ప్రయోజనాలనూ పొందారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబుసైతం డీమానిటైజేషన్పై మొదట అసంతృప్తిని వెళ్ళగక్కిన సంగతి మనకి తెలుసు. వ్యతిరేకిస్తున్నట్లుండడం..అంతర్లీనంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కేసీఆర్ మొదటి నుంచీ అనుసరిస్తున్న వైఖరి. తాజాగా మిర్చిపై హరీశ్ వ్యాఖ్యలు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తాయో వేచి చూడాల్సిందే. మరో కోణంలో చూస్తే..మిర్చి సృష్టించిన వివాదాల గొట్రునుంచి తప్పించుకోవడం దీని ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది. కేసీఆర్ ఏం చేసినా తెలివిడిగా.. కలివిడిగా చేస్తారు. హరీశ్ మీడియా సమావేశం అవ్వగానే రెండు కీలక నిర్ణయాలనూ తీసుకున్నారు కేసీఆర్. మొదటిది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరించి ఢిల్లీ నుంచి వస్తున్న దర్శకుడు కాశీనాధుని విశ్వనాథ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలకాలని మంత్రి తలసానిని ఆదేశించారు. రెండోది.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు పలుకుతామనీ తెరాస పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ రాజకీయ వైదుష్యానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి