“తెలంగాణా రాష్ట్రం ఏర్పడి రెండేళ్ళయినా ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఒక్కసారి కూడా రాలేదు కానీ విదేశాలు చుట్టి వస్తుంటారు,” అనేది తెరాస ప్రధాన ఆరోపణ. అక్టోబరులో తెలంగాణా భాజపా నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని ఈ మధ్యనే ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అది భాజపాకి సంబంధించిన వ్యవహారం అవుతుంది కనుక తెలంగాణా ప్రభుత్వం దానికి దూరంగా ఉండవలసి వస్తుంది. కనుక ఆయన రాష్ట్రంలో తొలిసారి పర్యటన జరిపినప్పటికీ దాని వలన తెలంగాణా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరదు పైగా ఆయన ఆ సభలో తెలంగాణా ప్రభుత్వంపైనే విమర్శలు చేసినా, చేయవలసి వచ్చినా ఆయనకీ, ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది.
అదే…ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక పర్యటన చేసినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం అనుకొన్న విధంగా కార్యక్రమాలు రూపొందించుకోగలుగుతుంది. కానీ రెండేళ్ళుగా ఆయన రాక కోసం ఎంతగా ఎదురుచూసినా ఒక్కసారి కూడా తెలంగాణా వచ్చే ఆలోచన చేయకపోవడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనని తెలంగాణా రప్పించేందుకు చాలా మంచి ఉపాయమే చేశారు.
తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథని ఆగస్ట్ 7న గజ్వేల్ లో ప్రారంభోత్సవం చేయడానికి రావలసిందిగా కెసిఆర్ స్వయంగా నిన్న ప్రధానిని ఆహ్వానించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు డిల్లీలో తెలంగాణా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ తనంతట తానుగా తెలంగాణాకి రాకపోతే, మిషన్ భగీరథ ప్రారంభోత్సవం పేరుతో ప్రధాని రావడానికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసి మరీ ఆయనని రప్పించే ప్రయత్నం చేయడం చూస్తే కెసిఆర్ తెలివితేటలని మెచ్చుకోకుండా ఉండలేము. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ ఆ కార్యక్రమానికి రా(లే)కపోతే, ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించినా కూడా ఆయన తెలంగాణాకి రావడానికి ఇష్టపడలేదని, కేంద్రప్రభుత్వం తెలంగాణా పట్ల వివక్ష చూపుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని తెరాస గట్టిగా ప్రచారం చేసుకోవచ్చు. హాజరయితే తెలంగాణా ప్రభుత్వం గొప్పదనం గురించి ఆయన నోటనే చెప్పించి రాష్ట్ర భాజపా నేతలు నోళ్ళు మూయించవచ్చు. ఏవిధంగా చూసినా తెరాసదే పైచెయ్యి అవుతుంది. శభాష్ కెసిఆర్!