తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళశై సౌందరరాజన్‌కు షాకివ్వబోతున్నారు. ఓ రకంగా గవర్నర్ పదవిని లెక్కలోకి తీసుకోనట్లుగా వ్యవహరించబోతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మార్చి ఏడో దేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆరో తేదీన మంత్రివర్గ సమావేశం జరిపి బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. ఏడో తేదీనే అసెంబ్లీలో బడ్దెట్ ప్రవేశ పెట్టనున్నారు. సాధారణంగా తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
కానీ ఈ సారి గవర్నర్ ప్రసంగాన్ని వద్దనుకున్న కేసీఆర్ మొదటి రోజే ఆర్థిక మంత్రి హరీష్ రావు చేత బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ గవర్నర్‌ను ఇటీవలి కాలంలో లెక్క చేయడం లేదు. గవర్నర్ వ్యవస్థ ఉనికిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లోనూకేసీఆర్ పాల్గొనలేదు. మేడారం పర్యటనకు హెలికాప్టర్ ఇవ్వకపోవడమే కాదు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సంప్రదాయబద్దంగా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించాల్సిన కార్యక్రమాన్ని కూడా వద్దనుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ గవర్నర్‌తో స్పీచ్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు మిస్ చేయవు.
అదో రాజ్యాంగ సంప్రదాయంగా ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ తో గవర్నర్ ధన్ కడ్ నేరుగా తలపడుతున్నారు. అయినప్పటికీ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని మమతా బెనర్జీ కాదనలేదు. కానీ తెలంగాణ సీఎం మాత్రం గవర్నర్ ప్రసంగాన్ని క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. తన నిర్ణయానికి చివరి వరకూ కట్టుబడి ఉంటే.. కేసీఆర్ గవర్నర్ వ్యవస్థ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లే అనుకోవచ్చు.