తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసర కేబినెట్ భేటీని నిర్వహిస్తున్నారు. పదమూడో తేదీన ఈ మీటింగ్ జరగనుంది. ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపడంతో పాటు జల వివాదంపై కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కృష్ణా జలాల్లో సగం వాటా ఉందని వాదిస్తున్న కేసీఆర్.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 299 టీఎంసీలకు మాత్రమే అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు.ఇప్పుడు ఇది వివాదాస్పదం అవుతోంది. దీంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్నదిశగా కేబినెట్ తీర్మానం చేస్తారన్న ప్రచారం ఉంది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణ బేసిన్ పరిధిలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ పై ఇప్పటికే కె ఆర్ ఎం బి తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు.
అంతే కాక ఎన్ జి టి తో పాటు సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ కేసు వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించలేని సమస్యగా మారింది. నీటిని వాడుకోవడం, విద్యుత్ ని తయారు చేయడం పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతని ఇచ్చింది. క్యాబినెట్ సమావేశం లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఆసక్తి గా మారింది. న్యాయస్థానాల నుంచి ఎలాంటి తీర్పులు వచ్చినా.. కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా.. తాము మాత్రం వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
299 టీఎంసీలకు అంగీకరించి సంతకం పెట్టిన అంశాన్ని విపక్షాలు హైలెట్ చేస్తూండటంతో.. ముందుగా.. ఆ అంశంపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా కృష్ణాబోర్డుకు సమాచారం పంపాలని నిర్ణయించుకునే అవకాశం ఉంది. తెగని పంచాయతీలా మారుతున్న కృష్ణాబోర్డువ్యవహారం ఇప్పుడు… తెలంగాణ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.