తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి వాసాలమర్రి గ్రామానికి వెళ్తున్నారు. వంద సార్లయినా వస్తానని గతంలో ఆయన హామీ ఇచ్చారు. గట్టిగా నెలన్నర కాకుండానే మూడో సారి వెళ్తున్నారు. ఈ సారి ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా దళిత ఎజెండాతో వెళ్తున్నారు. అక్కడ దళిత వాడను పరిశీలించి.. వారిలో మాట్లాడి.. దళిత బంధు గురించి చెబుతారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూన్ 22వ తేదీన వాసాలమర్రిలో విందు సమావేశం నిర్వహించారు. అప్పుడు పలు హామీలు ఇచ్చారు. వాటి అమలుకు చాలా సీరియస్‌గా ఉన్నానని చెప్పేందుకు.. కేసీఆర్ మరోసారి వాసాలమర్రికి వెళ్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు … ప్రతీ అడుగులోనూ రాజకీయంతోనే ముడిపడి ఉంటాయి. ఉపఎన్నికలు వచ్చినా .. లేకపోతే మరో రాజకీయ కారణం అయినా కేసీఆర్ నియోజకవర్గాలకు.. గ్రామాలకు వందల కోట్ల సాయం ప్రకటించేస్తూ ఉంటారు. అవన్నీ ఎంత వరకు అమలవుతున్నాయో ఎవరూ క్రాస్ చెక్ చేయరు. మీడియా కూడా పట్టించుకోదు. కానీ హూజూరాబాద్ విషయంలో మాత్రం పరిస్థితి మారింది. అందుకే.. తాను ఇచ్చిన మాట ప్రకారం చేస్తానని చెప్పేందుకు ఆయన తరచూ పర్యటనలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం… అధికారిక పర్యటన నిమిత్తం వరంగల్ వెళ్లి వస్తూ హఠాత్తగా వాసాల మర్రి గ్రామంలో ఆగారు. సర్పంచ్‌ను పిలిచి మాట్లాడి వంద కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. చాలా రోజులతర్వాత మళ్లీ వాసాల మర్రికి కేసీఆర్ వెళ్లారు. అప్పట్నుంచి మళ్లీ మళ్లీ వెళ్తున్నారు.
కేసీఆర్ ఏ పర్యనటకు వెళ్లినా వరాల జల్లు కురుస్తుంది. మున్సిపాలిటీలకు.. పంచాయతీలకు.. కోట్లకు కోట్లు ప్రకటిస్తూంటారు. తాజాగా నాగార్జున సాగర్‌లోనూ ప్రకటించారు. అయితే ఇప్పటికే ప్రకటించి ఉన్నందున వాసాలమర్రిలో ప్రకటించకపోవచ్చు కానీ… దళితులను మరింతగా ఆకట్టుకునేందుకు.. ప్రకటనలు చేసే అవకాశం ఉంది. వాసాలమర్రి గ్రామంలోనూ దళితులకు దళిత బంధు పథకాన్ని ముందే అమలు చేసినా ఆశ్చర్యం లేదని కొంత మంది అంటున్నారు.