జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయానని ప్రజలకు చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక ఢిల్లీ నుంచి కొంత కాలం పాటు రాజకీయాలు చేసే ఆలోచనలో ఉన్నారు. వచ్చే వారం ఆయన కొద్ది రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం కావడంతో పాటు బీజేపీ పాలనను వ్యతిరేకించే మేధావులు, రిటైర్ అయిన సివిల్ సర్వీస్ అధికారులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాలను సందర్శించిన ఆయన ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యారు. కలసి పని చేద్దామన్నారు. అయితే వారి నుంచి అనుకూల సంకేతాలు మాత్రం రాలేదు.
ఇప్పుడు ఢిల్లీలో అందుబాటులో ఉండే నేతలతో సంప్రదింపులు జరపనున్నారు. ఇప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా సరే కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. సొంత జిల్లాలో మల్లన్నసాగర్‌ను ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలోనూ అదే మాటలు చెప్పారు. ” చివరి రక్తపు బొట్టు ధారపోసి అయినా సరే దేశాన్ని చక్కదిద్దుతాను ’’ అని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం దేవుడు నాకిచ్చిన శర్వశక్తులూ ఒడ్డుతానని, సకల మేథోసంపత్తిని ఉపయోగిస్తానన్నారు. దేశం కూడా దారితప్పి పోతున్నదని .. కొందరు మతకల్లోలాల పేరిట విధ్వంసం సృష్టిస్తూ చిచ్చు పెడుతున్నారన్నారు. కుల, మత కల్లోలాల క్యాన్సర్‌ను ఈ దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలకు చేటు చేసే వారిని ఎక్కడికక్కడ నిలదీసి ఎదుర్కోవాలన్నారు.
దేశ పురోభివృద్ధి కోసం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తానన్నారు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణ రాజకీయాల కంటే జాతీయ రాజకీయాల గురించే ఆలోచిస్తున్నారు. ఢిల్లీకి గురి పెట్టి గల్లీలో మరోసారి అధికారం సంపాదించుకోవాలనే ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం ఇప్పటికే వినిపిస్తోంది. ఈ లక్ష్య సాధనలో కేసీఆర్ పెద్ద పెద్ద మాటలే చెబుతున్నారు. ఎంత వరకు వర్కవుట్ అవుతుందో కానీ.. ఆయన మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.