తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలందర్నీ పిలిచి లంచ్ మీటింగ్ పెడితే గతంలో ఎంతో హడావుడి ఉండేది. కానీ ఇప్పుడు.. ఆయన లంచ్ మీటింగ్ పెడితే ఎక్కడా హైప్ రాలేదు సరి కదా.. ఉద్యోగుల్లోనే ఆసక్తి లేకుండా పోయింది. దాదాపుగా 350 మంది ఉద్యోగ సంఘ నేతల్ని పిలిచారని ప్రచారం జరిగినప్పటికి.. వచ్చింది మాత్రం 250లోపే. వారితో కూడా.. ఏమి చర్చించారో క్లారిటీ లేదు. వారికి ఎలాంటి హామీ ఇచ్చారో కూడా తేలలేదు. కానీ కేసీఆర్ మాత్రం వారితో కలిసి భోజనం చేశారు. వారి ఉద్యోగ సంఘాల తరపున ప్రింట్ చేసిన క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘ నేతలు.. తాము చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు.
వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు, బదిలీలు, సరళతరమైన సర్వీసు నిబంధనలపై చర్చించామని.. సీఎం సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘ నేతలు చెప్పుకున్నారు. అన్నింటిపై జనవరిలోనే నిర్ణయం తీసుకుంటామన్నారని.. అలాగే ఆంధ్రాలో పనిచేస్తోన్న 850 మంది ఉద్యోగులను.. వారంలోగా స్వరాష్ట్రానికి తీసుకొస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని వారు సమావేశం ముగిసిన తర్వాత ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులు ఏపీలో.. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఉన్నారు. వారు.. తమను తెలంగాణకు తీసుకు రావాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు… వారంలోనే తీసుకొస్తామని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికిప్పుడు ప్రక్రియ ప్రారంభించినా… వారంలో వారిని తెలంగాణకు తీసుకు రావడం సాధ్యం కాదన్న అభిప్రాయాలున్నాయి. అయితే వీరి సమావేశం ముగియగానే.. సీఎస్ సోమేష్‌కుమార్‌కు పే రివిజన్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదికను సీఎస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ వారం పాటు పరిశీలిస్తుంది. ఎంత మేర ఫిట్ మెంట్ ఇవ్వాలో సిఫార్సు చేస్తారు. ఉపాధ్యాయ సంఘాల నేతల్ని సమావేశానికి పిలవకపోవడం… వివాదానికి కారణం అయింది. త్వరలో వారిని కూడా పిలుస్తామని సీఎంవో నుంచి ఓ సందేశం మాత్రం మీడియాకు అందింది.