ఆదివారం తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఆయనకు బదులుగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెళ్తున్నారు. రెండేళ్ల తర్వాత జరగనున్న ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారా లేదా అన్నదానిపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. కేంద్రంపై కేసీఆర్ విరుచుకుపడుతున్న సమయంలో … సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశలో ధాటిగా తన వాదన వినిపిస్తారని అనుకున్నారు. అధికారులు కూడా నివేదికలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు రెడీ చేశారు. కానీ కేసీఆర్ చివరి క్షణంలో తిరుపతి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
రెండేళ్లుగా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగలేదు. ఈ ఏడాది మార్చి 4వ తేదీన జరపడానికి అన్ని ఏర్పాట్లు జరిగినా ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సహా తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతున్నారు. పుదుచ్చేరి సీఎంతో పాటు అండమాన్, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్నెంట్ గవర్నర్లు కూడా హాజరవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. 27 అంశాలతో ఎజెండా సిద్ధమయింది.
మూడు రాజధానులకు నిధులు , ప్రత్యేకహోదా ల కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తామని ప్రభుత్వం మీడియాకు సమాచారం లీక్ చేసింది. అయితే ఎజెండాలో మాత్రం ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు.. ఇతరఅంశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతారా లేకపోతే.. ప్రతినిధుల్ని పంపుతారా అన్నదానిపై స్పష్టత లేదు. కేంద్రంపై ఒక్క కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల సీఎంలందరూ అసంతృప్తిగానే ఉన్నారు.