కొంతకాలం కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తిరుపతికి వెళ్లారు భారీ ప్రచారం, ప్రజాదరణ లభించాయి. కెసిఆర్ భక్తి ప్రపత్తులు తెలిసిన వారు ఆయన తలనీలాలు సమర్పించకుండా రావడమేమిటని ఆశ్చర్యపోయారు. అప్పుడో మిత్రుడు చాలా తేలిగ్గా సమాధానమిచ్చారు- ఆయనకు కత్తి అంటే భయం అని. ఇటీవల వరుసగా వాయిదా పడుతున్న కటి ఆపరేషన్ గురించి వివరిస్తూ కెసిఆర్ స్వయంగా ఈ భయాలను బయిటపెట్టినట్టు ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది. చిన్నచిన్నవాటికి భయం వుందని నిర్భయంగా చెప్పేశారాయన. వాస్తవానికి మనలో చాలా మందికి జూ ఫోబియా, హైపో ఖాండ్రియా, వంటివి వుంటాయి. ఎత్తు, లోతు ఖాళీ స్థలాలు వంటివి భయం కలిగిస్తుంటాయి చాలామందికి .బల్లిని చూసి భయపడే వారికి లెక్కేలేదు. కెసిఆర్‌కు కూడా ఇలాటి ఆకారణ భయాలు ఎక్కువేనని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. గతంలో ఆయనకు సహాయకుడుగా పనిచేసిన మాజీ ఎంఎల్‌సి దిలీప్ కుమార్ నాతో ఒక ఇంటర్వ్యూలో ఇలాగే ఆపరేషన్ వాయిదా ముచ్చట చెప్పారు. కేంద్రమంత్రిగా వున్నప్పుడు కెసిఆర్‌కు కాలు బెణికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందట. అంతా సిద్ధమయ్యాక ఆయన అడ్డం తిరిగి అమెరికా వెళ్లానన్నారట. అందరూ చేతులెత్తేశాక దిలీప్ వెళ్లి ఒక కథ చెప్పి ఒప్పించానన్నారు. అదేమంటే ఫారెస్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నపుడు గాయపడిన తన వేలికి సకాలంలో ఆపరేషన్ చేయించుకోనందుకు శాశ్వతంగా మెలితిరిగిపోయిందని చూపించారట. ఆ తర్వాత ఆయన ఆపరేషన్‌కు ఒప్పేసుకున్నారుట. ఇందుకు సంబంధించిన మరేవైనా నిజాలు వుంటే తెలిసిన వారు చెప్పొచ్చు. మొత్తానికి ఈ కళ్ల ముచ్చల ఆ కాలి చికిత్స ముచ్చటకు దగ్గరగానే వుండటం ఆసక్తికరం. ఎంతటివారైనా సరే కొన్ని భయాలు మనుషులను వెంటాడుతుంటాయి మరి!