తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న గజ్వేల్ సభలో ప్రసంగిస్తూ, “ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవో కొన్ని కోరికలు కోరడం సహజమే. కానీ నేనేమీ లక్ష కోట్లో..50వేల కోట్లో ఇమ్మని అడగను. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అవసరమైనవి మాత్రమే అడుగుతాను. రాష్ట్రంలో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు, రెండు ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఉద్యోగుల పంపకాలు, నీటి పంపకాలపై నేటికీ రెండు రాష్ట్రాల మధ్య సమస్యలున్నాయి. వాటిపై దృష్టి కేంద్రీకరించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను,” అని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన ఆ లక్ష కోట్లు..50వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి అన్నవేనని అర్ధమవుతూనే ఉంది. రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణా దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా అవతరించిందని ఆయనే చెప్పుకొన్నారు. సరిగ్గా అదే కారణం చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. రాజధాని కూడా లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలైనంత ఆర్ధిక సహాయం చేయమని కేంద్రాన్ని కోరుతున్నారు. అందులో ఎవరూ తప్పు పట్టడానికి కూడా లేదు.
కానీ ఆయన రాష్ట్ర పరిస్థితులకి, కేంద్రం ఇస్తానన్న ఆర్ధిక సహాయానికి అనుగుణంగా రాజధాని నిర్మించుకొనే బదులు, చేతిలో చిల్లి గవ్వ లేకపోయిన అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మించుకోవాలని కలలు కంటూ దానిని సాకారం చేసుకోవడానికి కేంద్రాన్ని ఉదారంగా సహాయం చేయమని ఒత్తిడి చేస్తున్నారు. బహుశః అందుకే కెసిఆర్ ఆవిధంగా దెప్పిపొడిచినట్లు చెప్పవచ్చు.
అయితే బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకి అడగకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ వేలు, లక్షల కోట్లు ఉదారంగా సహాయం చేస్తున్నప్పుడు, రాష్ట్ర విభజన కారణంగా దెబ్బతిన్న రాష్ట్రానికి కూడా అదేవిధంగా ఉదారంగా ఆదుకొమ్మని చంద్రబాబు నాయుడు కోరడంలో తప్పులేదు. పైగా ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పినందున ఏపికి కనీసం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి అయినా ప్రకటించాలని చంద్రబాబు నాయుడు చాలా కాలంగా కోరుతున్నారు. అయినా కేంద్రప్రభుత్వం ఇంతవరకు కరుణించలేదు. చంద్రబాబు నాయుడు రాజధానికి లక్షల కోట్లు కావాలని అడిగితే ఆయనని తప్పు పట్టవచ్చేమో గానీ ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు దానికి బదులుగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వాలని కోరితే తప్పులేదు. అడిగినా ఎవరికీ అభ్యంతరాలు ఉండకూడదు.