‘అరచేతిలో వైకుంఠం’ అనే సామెత వెనకటికి ఉంది! లేనిది ఉన్నట్టుగా, ఉండబోయేది అద్భుతంగా ఉంటుందని నమ్మబలికే సందర్భాన్ని ఇలా చెబుతుంటారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అరచేతిలో వైకుంఠాన్ని చూపించడంలో ఆరితేరిన వారిలో తెలంగాణ సీఎం ఒకరు! ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలని ఫిరాయింపుల మార్గంలో తెచ్చుకుంటున్నా… బంగారు తెలంగాణ సాధనకే అంటారు. అవసరం లేకున్నా కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సిద్ధమౌతూ… అదీ బంగారు తెలంగాణ సాధనే అంటారు. చీరలిచ్చినా, గొర్రెలిచ్చినా… ఇలా ప్రభుత్వం ఏది చేసినా కూడా అంతిమ లక్ష్యం బంగారు తెలంగాణ సాధన సాధన అంటూ తరచూ అంటుంటారు! నిజానికి, ఆ ‘బంగారు తెలంగాణ’ అంటే ఎలా ఉంటుందో మాత్రం ఎవ్వరికీ తెలీదు. ప్రభుత్వం పథకాలను ఎవరైనా విమర్శిస్తే… మీకు బంగారు తెలంగాణ ఇష్టం లేదా అంటూ ఇరికించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఇన్నాళ్లకు ఈ ఊహాజనితమైన అంశంపై శాసన సభలో కొన్ని నిజాలు మాట్లాడారు కేసీఆర్.
శాసనసభలో ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల అంశమై చర్చకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి స్పందించారు. కేసీఆర్ హయాంలో రెసిడెన్షియల్ కళాశాలు, పాఠశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. బంగారు తెలంగాణ అనేది రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదన్నారు. తెల్లారేలోపు భవనాలు నిర్మించడం సాధ్యం కాదన్నారు. గడచిన నాలుగైదు దశాబ్దాలుగా ధ్వంసమైన రాష్ట్రాన్ని, వ్యవస్థల్నీ మళ్లీ నిర్మించుకోవాలంటే మూడున్నరేళ్లు సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. తెల్లారేలోపుగా బంగారు తెలంగాణ తెస్తామని తాము ఎన్నడూ చెప్పలేదనీ, అలాంటి భ్రమలు కల్పిస్తున్నది కాంగ్రెస్ నేతలే అని ఆరోపించారు. మనది కొత్త రాష్ట్రమనీ, ఈ సర్కారుకు మరో 20 నెలల సమయం ఉందనీ, ఈలోగా తాము చేయాల్సి చేసి చూపిస్తామనీ ముఖ్యమంత్రి ఉద్వేగంగా చెప్పారు. హాస్టళ్ల భవనాల నిర్మాణానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
ఏదైనా ఒక మంచి పనిచేస్తే… అది తమ ఘనతే అని చాటి చెప్పుకుంటారు. చేయలేకపోతే… మనది కొత్త రాష్ట్రం, అందుకే కొంత ఆలస్యం అవుతోందీ, రాత్రికి రాత్రే అనుకున్నవి సాధ్యం కావు కదా.. అంటూ ఇలాంటి వాదన వినిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ‘బంగారు తెలంగాణ’ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు కొంత స్పష్టత ఇచ్చారనే చెప్పాలి. అదో అద్భుతం అంటూ ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిందీ ఆయనే.. ఇప్పుడు అది రాత్రికి రాత్రే సాధ్యం కాదని చెబుతున్నదీ ఆయనే. బంగారు తెలంగాణ అంశంపై కేసీఆర్ ఇలా స్పందించడం, ముందు జాగ్రత్త చర్యగా కూడా చూడొచ్చు! రేప్పొద్దున్న, ఎన్నికల ప్రచారంలో ‘కేసీఆర్ తెస్తామన్న బంగారు తెలంగాణ ఏదీ’ అని ఎవ్వరికీ విమర్శించే ఆస్కారం లేకుండా చేస్తున్నారనీ చెప్పొచ్చు.