ప్రసిద్ధ యాదగిరిగుట్ట క్షేత్రానికి యాదాద్రి అని పేరు మార్చడంతోనే సరిపెట్టుకోవడం లేదు ముఖ్యమంత్రి కేసీఆర్. తిరుమల తరహాలో ప్రసిద్ధ ఆధ్మాత్మిక కేంద్రంగా మలచడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అమలు చేయడం మొదలుపెట్టారు. బుధవారం ఆయన మరోసారి యాదాద్రికి వెళ్లారు. రాజగోపురాలకు శంకుస్థాపన చేసిన ప్రదేశాలను పరిశీలించారు. పరిసరాలను, నవీకరణ పనులను కూడా పరిశీలించారు. యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేశారు.
కొండ పైకి రోడ్లు వెడల్పు మొదలుకుని అత్యాధునికంగా సదుపాయాలు కల్పించడానికి మెగా ప్లాన్ ఇప్పటికే సిద్ధమైంది. ఆలయాన్ని ప్రాచీన వారసత్వ సోయగం ఉట్టిపడేలా నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత ఆర్టిటెక్ట్ ఆనంద్ సాయి రూపొందించిన నమూనాకు కేసీఆర్ ఒకే చెప్పారు.
ఆలయం ప్రాచీన కళావైభవాన్ని కళ్లకు కడుతుంది. మౌలిక సదుపాయాలు మోడ్రన్ పద్ధతుల్లో ఉంటాయి. ఈ వైవిధ్యమైన ప్లాన్ ను ఎన్నో నెలల కసరత్తు తర్వాత ఓకే చేశారు. రాయగిరి నుంచి యాదాద్రికి నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం ప్రతిపాదన ఓ సంచలనంగా భావిస్తున్నారు. ఆలయం, పరిసరాల తర్వాత కొండ చుట్టూ కొలనులు, ఆహ్లాదకరమైన పార్కులు, వివిధ రకాల చెట్లు ఇంకా అనేక విధాలుగా అభివృద్ధి చేయబోతున్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే యాదాద్రిపై మొదట దృష్టి పెట్టారు. మొట్టమొదట 100 కోట్ల రూపాయల నిధులు ప్రకటించారు. ప్రతిఏటా 100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.
ఇప్పుడు యాదాద్రి క్షేత్రం అభివృద్ధికి ఓ అథారిటీనే ఏర్పాటు చేశారు. బుధవారం నాడు కేసీఆర్ చాలాసేపు యాదాద్రిలోనే గడిపారు. అక్కడి పనులపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తున్న యాదాద్రి ఎలా ఉండబోతోందో ఊహిస్తున్నారా అన్నట్టు, పరిసరాల్లో కలియదిరిగారు. పలు విషయాలను ఆసక్తిగా గమనించారు. యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దడంపై ఆయనకు ఎంత శ్రద్ధ ఉందో బుధవారం మరోసారి అందరికీ అర్థమైంది.