తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాపిడ్ టెస్టులో కరోనా నెగెటివ్‌గా తేలింది. ఆయన శాంపిల్ ను ఆర్టీ-పీసీఆర్ టెస్టు కూడా చేస్తున్నారు. ఈ టెస్టు ఫలితం రేపు వస్తుంది. పాజిటివ్‌గా తేలినప్పుడు కూడా.. ఆర్టీపీసీఆర్ టెస్టు చేసి నిర్ధారించారు. వాస్తవంగా కేసీఆర్ .. బుధవారం యశోదా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే వైద్య బృందమే .. ఫామ్‌హౌస్‌కు వెళ్లి పరీక్షలు జరిపింది. రాపిడ్ టెస్టులో నెగెటివ్‌గా తేలింది. పాజిటివ్ గా తేలినప్పటి నుండి ఫామ్ హౌస్‌లోనే ఉండి… చికిత్స పొందుతున్న కేసీఆర్.. అధికారిక సమీక్షలు.. వర్చవల్‌గా చేస్తున్నారు.
ఫోన్ల ద్వారా పరిపాలన… పార్టీ పరమైన విషయాలను చూసుకుంటున్నారు. గతంలో ఉన్న స్వల్ప లక్షణాలు కూడా ఇప్పుడు తగ్గిపోయాయి. కొద్ది రోజుల కిందట యశోదాలో చేసిన టెస్టుల్లో… మొత్తం నార్మల్ గా ఉన్నట్లుగా తేలింది. దీంతో రేపు ఆర్టీ పీసీఆర్ పరీక్ష ఫలితం వచ్చిన తర్వాత కేసీఆర్ నేరుగా పరిపాలన వ్యవహారాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కరోనా నియంత్రణపై సమీక్షలు చేసి ఆయన కీలకమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
30వ తేదీ తర్వాత ఎప్పుడైనా లాక్ డౌన్ విధించడానికి అనుకూలంగా వైద్య ఆరోగ్య శాఖ ఓ నివేదికను సిద్ధం చేసి హోంశాఖకు పంపింది. ఈ నివేదికను సీఎం పరిశీలించి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ కు పాజిటివ్‌గా తేలిన తర్వాత ఎంపీ సంతోష్.. మంత్రి కేటీఆర్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. వారికి కూడా మూడు నాలుగు రోజుల్లో టెస్టులు చేసే చాన్స్ ఉంది.