టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలో మాత్రమే కాదు ఢిల్లీ .. గుజరాత్ .. అలాగే విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించారు. అయితే ఎక్కడ జరిగినా సంబరాల్లో చూసినా ఓ కృత్రిమత్వమే కనిపించింది కానీ గతంలోలా ప్రజాభిమానం కనిపించలేదన్న అసంతృప్తి మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో ప్రారంభమయింది. పార్టీ అధికారంలో ఉంది.. పార్టీ తరపున పదవులు తీసుకున్నవారు.. పదవులు ఆశిస్తున్న వారు .. సంపాదించిన వారు.. ముందు ముందు సంపాదించాలనుకుంటున్న వారు తమ శక్తి మేర హైకమండ్ పెద్దల దృష్టిలో పడేందుకు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపారు.
కానీ మూడు, నాలుగేళ్ల క్రితం పరిస్థితి అలా ఉండేది కాదు.. తెలంగాణ సాధించిన కేసీఆర్పై ఓ భావోద్వేగం ప్రజల్లో ఉండేది. ఇప్పుడది పూర్తిగా తగ్గిపోయింది. పార్టీ పరంగా మాత్రమే కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదే సమయంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్ని విపక్షాలు టార్గెట్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలకు లింక్ పెట్టి ఆందోళనలకు పిలుపునిచ్చింది. రేవంత్ రెడ్డిని రోజంతా అరెస్ట్ చేసి ఉంచడం కూడా హాట్ టాపిక్ అయింది. అదే సమయంో ట్వీట్లు ట్రెండింగ్లో తెచ్చుకోవడానికి కష్టపడ్డారు కానీ.. ఆన్లైన్లో అంత సీరియస్గా తీసుకోలేదు.
స్కూళ్లలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు చేయడానికి ఒక్కో స్కూల్కు రూ. పదివేలు ఇచ్చిన ఉత్తర్వులు కూడా వివాదాస్పదమయ్యాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజును సంబరంగా చేయాలని… కేటీఆర్ నిర్ణయించడానికి కారణం జాతీయ రాజకీయాలే. జరగడానికైతే అత్యంత వైభవంగా వేడుకలు జరిగాయి కానీ అది తెలంగాణలోనే.. మరీ అతి అనే ప్రచారానికి కారణం అయింది కానీ.. అభిమానం అనే మాట తక్కువగా వినిపించిందన్నది ఎక్కువ మంది అభిప్రాయం.