తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక పథకం… “రైతుబంధు” ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ఆయా ప్రభుత్వ ఈ పథకాన్ని … వేరే పేర్లతో యథాతథంగా అమలు చేస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో.. ఈ విషయంలో.. హడావుడి పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత … “రైతుబంధు” పథకం గురించి చాలా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి.. వాకబు చేశారు. సమాచారం తీసుకున్నారు. ఆ సమాచారంతో పథకాలు ప్రకటించడం ప్రారంభించారు. ఈ జాబితాలో తాజాగా చేరిన రాష్ట్రం బెంగాల్. రైతుల కోసం.. రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టింది. పేర్లు కూడా బెంగాలీలో అవే పెట్టారు. క్రిషక్ బంధు, క్రిషక్ బీమా పేర్లతో పథకాలను ఆవిష్కరించారు. బెంగాల్‌లోని మొత్తం 72 లక్షల మంది రైతులకు పథకం వర్తిస్తుందని ప్రకటించారు. రైతు ఆత్మహత్య సహా ఏ కారణం వల్ల మరణించినా 2 లక్షల రూపాయల బీమా పరిహారం చెల్లిస్తారు. ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతు బంధు పథకం కింద రైతుకు ఎకరానికి రూ.5000 చొప్పున రెండు విడతల్లో అందిస్తారు. రెండు పథకాలకు బెంగాల్ ప్రభుత్వం తెలంగాణ తరహాలోనే వ్యవసాయ శాఖ బడ్జెట్ నుంచి కేటాయింపులు చేయనుంది.
కొద్ది రోజుల కిందటే… రైతు బంధు తరహా పథకాన్ని ఒడిషా ప్రభుత్వం ప్రకటించారు. “కర్షక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్వీహుడ్ అండ్ ఇన్‌కం అగ్మెంటేషన్..” సంక్షిప్తంగా కలియా పేరుతో పథకాన్ని ప్రకటించారు. సాగు పెట్టుబడి కోసం ఒక్కో రైతుకు పదివేలరూపాయల సర్కారు సాయం చేస్తుంది. ఒడిషా బడ్జెట్ లో దీని కోసం రూ.10,180 కోట్లను కేటాయిస్తున్నారు. జార్ఖండ్‌లోనూ రైతుబంధు పథకాన్ని అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారుల బృందం తెలంగాణలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ లోపే ప్రకటించే అవకాశం ఉంది.
రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం కూడా.. ఈ పథకంపై దృష్టి పెట్టిందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అమలు చేసిన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇటీవల కేంద్ర బృందం తెలుసుకుంది. కొన్ని మార్పులు చేసి.. ఎన్నికల ప్రకటనకు ముందే ఈ పథకాన్ని ప్రకటించబోతున్నారని.. కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఫెడరల్ ఫ్రంట్ బ్రాండ్ పథకంగా.. “రైతుబంధు”ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమోట్ చేయాలనుకున్నారు. దీర్ఘ కాలిక వ్యూహంతోనే.. “రైతుబంధు” పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు… అన్ని భాషల పత్రికలు, టీవీ చానళ్లలోనూ ప్రకటనలు ఇచ్చారు. తమ ఫ్రంట్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ పథకం బలంగా ప్రజల్లోకి వెళ్లడంతో.. ఫెడరల్ ఫ్రంట్ వచ్చేదాకా ఆగకుండా… ఆయా రాష్ట్రాలు అమలు చేయడం ప్రారంభించాయి. చివరికి కేంద్రం కూడా.. “రైతుబంధు”నే బంధువుగా భావిస్తోంది.