జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ తొలి ఘట్టం మందకొడిగానే వుంది. పార్టీలు ఎంతగా పోట్లాడుకున్నా నగర వాసులు మాత్రం ఉత్సాహంగా తరలి వచ్చినట్టు కనిపించలేదు. బహుశా యాభై శాతం దాటితే గొప్ప కావచ్చు.
ఈ ఎన్నికల సందర్భంలోనే తునిలో హింసాత్మక ఘటనలు జరగడంపై టిడిపి మిత్రులు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. కెసిఆర్‌కు సహాయపడేందుకే కాపునాడు పేరిట కల్లోలం సృష్టించారని వారి ఆరోపణ. వైసీపీ పోటీ చేయకపోవడం వల్ల సీమాంధ్ర ఓట్లు చీలకుండా తెలుగుదేశంకు వచ్చే అవకాశం వుండేది. ఇప్పుడు ఒక వర్గం దూరమవుతుందనేది వారి వాదన. అయితే అదే సమమయంలో అనుకూలంగా వుండేవారు మరింత గట్టిగా టిడిపి వైపు వచ్చే అవకాశం వుంటుంది కదా అనే వాదన మరొకటి వినిపిస్తున్నది.
షరామామూలుగా ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కలు నడుస్తున్నాయి. మిగిలినవారి అంచనాలు పక్కనపెట్టి అసలు మూలవిరాట్టయిన కెసిఆర్ లెక్క ఎలా వుంది? నిన్న రాత్రి ఆయన తమకు వంద సీట్లకు పైగానే వస్తాయని చెప్పారని టిఆర్ఎస్ ఎంపి ఒకరు వెల్లడించారు. గతంలో వరంగల్ ఎన్నికల సమయంలో కెసిఆర్ వీరిని అంచనాలు అడిగారట. వీరంతా లక్ష రెండు లక్షలు అని చెబుతుంటే కెసిఆర్ వాటిని కొట్టి పారేశారట. ప్రతిపక్షాలకు డిపాజిట్టు రావు, మనకు అయిదు లక్షల మెజార్టి వస్తుందని జోస్యం చెప్పారట. అది నిజమైనట్టే ఇప్పుడు జిహెచ్‌ఎంసిలోనూ వంద వస్తాయనేది వారి ఆశ. మరైతే మిగిలిన వారికి రావా అంటే కాంగ్రెస్‌కు రావు. మజ్లిస్‌కు ముప్పై వస్తే టిడిపికి పదో పదిహేనో వస్తాయి.. చూడండి మీకే తెలుస్తుంది అని ముక్తాయించాడా ఎంపిగారు.