మూసీని ప్రక్షాళన చేసి.. రివర్ సిటీగా మార్చి హైదరాబాద్‌కు కొత్త కళ తీసుకు రావాలని రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చాలా మాటలు పడుతున్నారు. ఆయనపై దండెత్తడానికి పేదల్ని రెడీ చేసేందుకు బీఆర్ఎస్ చాలా ప్రయత్నం చేస్తోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తగ్గేది లేదంటున్నారు. మూసీని సుందీరకరణ చేసి తాను అనుకున్నట్లుగా చేసితీరుతానని.. నిర్వాసితులకు అవసరమైతే పది వేల కోట్లు అయినా ఇస్తానని అంటున్నారు. ఆయన పట్టుదల చూస్తే రేవంత్ వెనక్కి తగ్గే అవకాశాలు లేవని అర్థం చేసుకోవచ్చు.
అయితే మూసీ విషయంలో ఇలా పట్టుదల చూపిన మొదటి సీఎం రేవంత్ మాత్రమే కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ కూడా ఏదో చేద్దామని అనుకున్నారు. వైఎస్ హయాంలో ఓ మూసీ కోసం ఓ పథకం పెట్టామని తొమ్మిది వందల కోట్లు కేటాయించినా.. ఖర్చు సరిపోదని ముందుకు వెళ్లలేదని కేవీపీ తాజాగా రేవంత్‌కు రాసిన లేఖలో చెప్పుకొచ్చారు. కేసీఆర్ కూడా మూసీ సుందీరకరణ కార్పొరేషన్ పట్టి రూ. వెయ్యి కోట్లు అప్పు తెచ్చారు కానీ.. పట్టించుకోలేదు. ఆ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఫిరాయింపు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి చాన్స్ ఇచ్చినా పనేమీ లేకపోయిందని ఆయన ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.
అంటే ఇద్దరు బలమైన సీఎంలు మూసీ విషయంలో అడుగు ముందుకు వేసి అనుకున్నది చేయలేకపోయారు. ఆపేసి వేరే పనులు చూసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చింది. ఆయన ఇప్పటికి అయితే బలమైన వాదన వినిపిస్తున్నారు. ఎలాంటి ఆటంకాలను అయినా అధిగమిస్తానని బలంగా చెబుతున్నారు. ఇప్పుడు మూసి నిర్వాసితులు.. వారిని రెచ్చగొట్టే పార్టీలు మాత్రమే కాదు.. నిధులు కూడా సమస్యే. అన్నింటినీ అధిగమించి మూసీని సుందీరకరణ చేస్తే.. వైఎస్, కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి మొనగాడిగా చరిత్రలో నిలిపోతారు. మరి రేవంత్ సాధిస్తారా ?