చెన్నమనేని విద్యాసాగర్ రావు జీవిత చరిత్ర ఉనిక పుస్తకాన్ని హైదరాబాద్లోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. చెన్నమనేని రాజకీయాల్లో ఆజాతశత్రువులాంటివారు. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రమే ప్రత్యర్థులు ఉంటారు. తర్వాత వారు కూడా ఉండరు. అంతటి పద్దతి అయిన రాజకీయాలు చేశారు. ఆయన జీవిత చరిత్రను ఉనిక అనే పుస్తక రూపంలో తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. బీజేపీ నేత, మాజీ గవర్నర్ అయినప్పటికీ రేవంత్ రెడ్డి స్వయంగా పుస్తకావిష్కరణకు హాజరయ్యారు. విద్యాసాగర్ రావు గురించి మంచి మాటలు చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు.
ఆయన కరుడు గట్టిన బీజేపీ నేత అని రేవంత్ అనుకోలేదు. అలాగే రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని విద్యాసాగర్ రావు కూడా అనుకోలేదు. ఆహ్వానించారు. నిజానికి బీఆర్ఎస్ ముఖ్యుల్ని కూడా ఆహ్వానించారు విద్యాసాగర్ రావు. కానీ రేవంత్ ను హాజరవుతున్నారన్న కారణంగా వారు ఎవరూ రాలేదని చెబుతున్నారు. నిజానికి విద్యాసాగర్ రావు .. కేసీఆర్కు కూడా ఎంతో గౌరవం ఇచ్చేవారు. ఓ సారి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు నీటి సమస్య పరిష్కారం కోసం ముంబై వస్తే రాజ్ భవన్ లోనే ఆతిధ్యం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయనను వ్యక్తిగతంగా గౌరవించి పుస్తకావిష్కరణకు హాజరయ్యేందుకు మాత్రం ఆసక్తి చూపించలేకపోయారు.
చెన్నమనేని విద్యాసాగర్ రావు.. రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి. ఇదే సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కౌన్సిలర్ గా పని చేసిన వ్యక్తిపైనే ఎన్నో ఆరోపణలు వస్తాయి. కానీ విద్యాసాగర్ రావుపై మాత్రం ఇప్పటి వరకూ చిన్న ఆరోపణ కూడా రాలేదు. ఎవరితోనూ మాటలు పడేలా మాట్లాడలేదు. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన అత్యున్నత ప్రమాణాలు ఉన్న రాజకీయాలు నడిపారు. ఇలాంటి తెలంగాణ నేతకు గౌరవించే విషయంలో బీఆర్ఎస్ ఆసక్తి చూపించలేదు.