తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్కె సింగ్ ప్రత్యేకంగా వివిధ శాఖల అధిపతులకు రాసిన లేఖ సారాంశమిది. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జారీ చేసిన ఆదేశాలు చెప్పిన మాటలు కూడా అమలు కావడం లేదని ఇంగ్లీషు పత్రికలు రాశాయి. అంతవరకూ అక్కర్లేకుండానే ప్రతిపక్షాలు ఎప్పుడూ ఈ వాస్తవాన్ని చెబుతూనే వచ్చాయి. పైన ప్రకటనలు గంభీరంగా వున్నా క్షేత్ర స్తాయికి చేరడం లేదని చెప్పే అనేక ఉదాహరణలు బయిటకు వచ్చాయి. ఇక జిల్లాలలోనైతే చెప్పడానికే లేదు. కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నిత్య సమీక్షలు నిరంతర ఆదేశాలు గ్రామీణులదాకా చేరడం లేదు గనకే వారిలో కొరత వుంటున్నదని పాలక పక్ష నేతలు కూడా మా దగ్గర అంటుంటారు. అవినీతి పోకడలు ముడుపులు షరామామూలుగా సాగడమే గాక కొంత పెరిగాయి కూడా. ఇలాటి నేపథ్యంలో అసలు అధినేత ఆదేశాలే అమలు కాలేదని వార్తలు రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహించింది. బహుశా ఆయన సచివాలయానికి రాకపోవడం, ప్రగతి భవనమే పాలనా కేంద్రం కావడం కూడా ఇందుకు ఒక కారణమై వుండాలి. ఏమైతేనేం మీడియా కథనాల తర్వాతనైనా కొంత కదలిక రావడం మంచిదే. సిఎంవో నుంచి వచ్చిన ఆదేశాలు వెంటనే అమలు చేయాలని సందేహాలుంటే తక్షణం తీర్చుకోవాలని సూచించాల్సివచ్చిందంటే ఈ ఫిర్యాదులు నిజమేనని ప్రభుత్వం అంగీకరించిందన్నమాట. వారిదాకా రాని అంశాలు ఇంకా చాలా వున్నాయి.పనిలోపనిగా అవి కూడా చక్కదిద్దితే ప్రజలు సంతోషిస్తారు. ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించిన సబ్జిడీ గొర్రెల పథకం కూడా పక్కదోవ పట్టింది. షీ టీములను అందరూ హర్షించినా ఇప్పుడు స్త్రీలపై అత్యాచారాలు దాడులు పెరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ జరపలేమనిచేతులెత్తేయడం కూడా ఒక వైఫల్యమే. వేముల ఘాట్ ఆందోళనల వంటివి నెలల తరబడి సాగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరంలోనూ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసుల అత్యుత్సాహం దాష్టీకాల ఘటనలు చాలా వచ్చాయి. రైతుల ఆత్మహత్యలు కూడా కొనసాగుతూనే వున్నాయి. . అయితే నాణేనికి మరో వైపులాగా ఉద్యోగుల అధికారుల బాధలు కూడా వున్నాయి. తగు సన్నాహాలు లేకుండా ప్రచార కోణంలో ప్రకటనలు చేసి ఆఘమేఘాల మీద అమలు చేయాలంటే కష్టమని వారంటున్నారు. సిబ్సంది లేకపోవడం కూడా పెద్ద సమస్యగాచెబుతున్నారు. సిఎంవో ఆదేశాల అమలుతో పాటు ఈ రకరకాల సవాళ్లపై కూడా దృస్టిపెడితే బాగుంటుంది