ముందస్తు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా మ్యానిఫెస్టోని ప్రకటించేసింది. కొద్దిరోజుల క్రితమే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేతృత్వంలో మ్యానిఫెస్టో కమిటీని నియమించిన ఉత్తమ్.. ఈ రోజు కమిటీ చేసిన సిఫార్సులన్నింటినీ మీడియా ముందు ప్రకటించారు. గతంలో ఏకమొత్తంగా రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తున్నారు. అదే హైలెట్ కాగా.. దానికి అనుబంధంగా.. మరిన్ని ఆకర్షణీయ పథకాలు పథకాలు ప్రకటించారు. డబుల్ బెడ్ రూమ్ పథకం కింద లబ్ధిదారులకు రూ.5 లక్షలు , ఇందిరమ్మ లబ్ధిదారులు మరో గది కట్టుకునేందుకు రూ.2లక్షలు ఇస్తామన్నారు. లబ్ధిదారులకు సొంత స్థలంలోనే ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు.
బీసీ, మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గృహాల విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు టెలిస్కోపింగ్ విధానంలో మార్పులు, ఆలయాలు, మసీదులు, చర్చిలకు ఉచిత విద్యుత్ హామీల జాబితాలో ఉన్నాయి. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 7 కిలోలు సన్నబియ్యం, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సన్న రేషన్ బియ్యం, నిత్యావసరాలు, రేషన్డీలర్లకు క్వింటాకు రూ.100 కమిషన్..బకాయిలు చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టనున్నారు. బీపీఎల్ కుటుంబాలకు ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు, 7వ తరగతి నుంచి ఇంటర్ చదివే బాలికలకు ఉచితంగా సైకిళ్లు, కౌలురైతులకు కూడా రైతులుగా హక్కులు కల్పిస్తామని ఉత్తమ్ ప్రటించారు. అలాగే రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తారట
హైదరాబాద్కు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు. గెలిచే అవకాశం ఉన్న జర్నలిస్టులకు టికెట్లు ఇస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఆపేసిందని.. ఆగిపోయిన బిల్లును కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెల్లిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్నప్పుడు.. ఈ హామీలన్నింటినీ ప్రింటెడ్ మ్యానిఫెస్టో రూపంలో విడుదల చేయనున్నారు.కేకే నేతృత్వంలో టీఆర్ఎస్ మ్యానిఫెస్టో కమిటీని నియమిస్తున్నట్లు కేసీఆర్.. ప్రగతి నివేదన వేదిక మీదే ప్రకటించారు. టీఆర్ఎస్ హామీలు ఎంత ప్రజాకర్షణగా ఉంటాయో.. అంతకు మించి కాంగ్రెస్ కొత్త హామీలను మ్యానిఫెస్టో సమయానికి రెడీ చేసే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణలో ముందస్తు హామీలు… ప్రజలందరికీ.. ఏ పనీ చేయకుండా బతికేసే ధైర్యాన్నిచ్చేలా ఉన్నాయి.