తెంలగాణ కాంగ్రెస్ నేతలు… తమ బలాలేమిటి..? తన బలహీనతలేమిటి..? అనేదాన్ని విశ్లేషించుకోవాలి. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భుస్థాపితమయింది. తెలంగాణలో రాష్ట్రాన్నిచ్చిన పార్టీగా ఫలితాన్ని సాధించలేకపోయింది. పాజిటివ్ సెంటిమెంట్ ఉంది..చెప్పుకోవడానికి అవకాశం ఉంది.. సోనియా గాంధీ ఇమేజ్ ఉంది. టీఆర్ఎస్ కూడా సోనియాను నిందించడానికి సిద్ధంగా లేదు. సోనియాపై విమర్శలు చేసినా ప్రజలు అంగీకరించేవారు కాదు.
బలమైన క్యాడర్ కాంగ్రెస్కు బలం..!
తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ సకుటుంబ సపరివార సమేతంగా సోనియా వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పారు. ఆ ఫోటో మీడియాలోనూ విస్త్రతంగా ప్రచారమవుతోంది. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను.. నెరవేర్చిన పార్టీగా.. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన నేతగా సోనియాకు గుర్తింపు ఉండటం.. కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన బలం. కలసి వచ్చే రెండో అంశమేమిటంటే… టీఆర్ఎస్ ను వ్యతిరేకించే వారికి.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కావాలనుకున్నవారికి.. కాంగ్రెస్ పార్టీ చాయిస్ గా ఉంది. టీడీపీ పూర్తిగా బలహీనపడింది. బీజేపీకి అసలు లెక్కలోకి రాదు. వామపక్షాలు ఉనికి చాటుకున్నా.. బలమైన శక్తిగా ఎదగలేదు.అందువల్ల టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న మరో బలమైన ప్లస్ పాయింట్.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్ ఉండటం. ఈ క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. ఈ మూడు అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాలు. ఈ బలాన్ని మరింత పెంచుకోవాలి. బలాన్ని కన్సాలిడేట్ చేసుకోగలగాలి.
నాయకత్వ లేమి ప్రధాన లోపం..!
మరి బలహీనతలు కూడా చాలా ఉన్నాయి. అందులో మొదటిది.. అతి పెద్దది.. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం. కాంగ్రెస్ పార్టీ లక్షణం అందే. అందరూ సీనియర్ లీడర్లే. అందరూ ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటారు. సోనియా, రాహుల్ దగ్గరకు వచ్చేసరికే ఏకాభిప్రాయం ఉంటుంది. నేతల మధ్యమాత్రం సఖ్యత ఉండదు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి అందరూ కలసి పని చేస్తారు. ఇలాంటి పరిస్థితి అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. టీఆర్ఎస్ లో ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య టిక్కెట్ల పోటీ ఉంది. టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి. ఎలాగోలా మేనేజ్ చేసుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కాదు. బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. అమిత్ షా వచ్చి నేరుగా విమర్శించి వెళ్లాడు. అదికారానికి వచ్చే అవకాశమే లేనిచోట..నేతలు అలా కొట్లాడుకోవడంపై మండిపడ్డారు. కానీ అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర స్వభావం.ఈ సమస్యను కాంగ్రెస్ అధిగమించాల్సి ఉంది.
కేసీఆర్కు సరితూగే నేతను సిద్ధం చేసుకోవాలి..!
ఉద్యమనాయకుడిగా కేసీఆర్ శిఖరంలా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. కేసీఆర్ కు పోటీగా.. కాంగ్రెస్ పార్టీ ఓ నాయకుడ్ని ప్రొజెక్ట్ చేయలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇబ్బందేమిటంటే… ఎవరో ఒకరు పూర్తి బాధ్యత తీసుకుని పనిచేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. పూర్తి స్థాయిలో కష్టపడి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే.. ఆ తర్వాత హైకమాండ్ ఆశీస్సులతో ఇంకొకరు ముఖ్యమంత్రి కావొచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ లక్షణం. అందువల్ల ఏ ఒక్క నాయకుడు.. కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోరు. కాంగ్రెస్ కు ఉన్న మరో వీక్ నెస్ ఏమిటంటే.. ఎగ్రెసివ్ గా వెళ్లలేకపోవడం. టీఆర్ఎస్ అధికార పార్టీ కాబట్టి… నేరుగా.. కాంగ్రెస్ పార్టీపై ఎటాక్ చేస్తోంది. కానీ… కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేకపోతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత.. లేకపోవడం.. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. కానీ.. కొన్ని వర్గాల్లో కేసీఆర్ పని తీరుపై అసంతృప్తి ఉంది. కొన్ని అంశాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం ఉంది. వీటన్నింటినీ చూసుకుని.. ఆయావర్గాల్లో ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకుని.. వారిని తమ వైపు తిప్పుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు.
విమర్శలు కాదు.. పోరాటాలు చేస్తేనే ప్రయోజనం.. !
ప్రభుత్వ పథకాల్ని, కేసీఆర్ ను విమర్శిస్తే ప్రభుత్వం వచ్చేస్తుందనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు ఎలా ఉందంటే.. కేసీఆర్ పై వ్యతిరేకత ఉంటే.. కాంగ్రెస్ గెలుస్తుంది…లేకపోతే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వ్యతిరేకత లేకపోతే.. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదనే భావనలో ఉన్నారు. అందుల్ల మూలాల్లో ఏ వర్గాల్లో అసంతృప్తి ఉందో వారిని గుర్తించి.. వారి కోసం ఉద్యమాలు చేసే ప్రయత్నం చేయలేదు.ప్రత్యేకహోదా ఇవ్వనందుకు.. అన్ని పార్టీలు ప్రత్యేకహోదాను ఓ ఇష్యూగా మార్చుకుని పోరాటం చేస్తున్నాయి. ఓ రకంగా ఈ ఇష్యూని.. రాజకీయంగా ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ తెలంగాణలో రాజకీయ కారణాలతో టీఆర్ఎస్ సైలెంట్ గా ఉంటోంది. అవిశ్వాసానికి అనుకూలంగా … కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా.. ఓటింగ్ నుంచి తప్పించుకుంది. మోడీని చాలా మాటలన్నాం..అని చెబుతున్నారు కానీ పరోక్షంగా మద్దతిచ్చినట్లే. అందు వల్ల తెలంగాణలో కేంద్రంపై పోరాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ తీసుకుని ఉండాల్సింది. ఎందుకంటే.. బీజేపీతో టీఆర్ఎస్ సానుకూల వైఖరితో ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది.
టీఆర్ఎస్పై అసంతృప్తిగా ఉన్న వారిని ఆకట్టుకోవాలి..!
కానీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకు లేదో వాళ్లకే తెలియాలి. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ కు బ్రాహ్మండమైన అవకాశం ఉంది. రాష్ట్రం ఇచ్చిన ఇమేజ్ ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ను బీజేపీ రద్దు చేసింది. బయ్యారం స్టీల్ ప్లాంట్ చట్టంలో ఉన్నా…ఇవ్వనంటోంది. ఇవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో కేజీ టు పీజీ విద్య, దళితులు మూడెకరాలు.. వంటివి అమలు కాలేదు. ఉద్యోగాలు సహా అనేక హామీలు పెండింగ్ లో ఉన్నాయి. ఊరికే గాంధీభవన్ లో కూర్చుని విమర్శలు చేస్తే ప్రయోజనం ఉండదు. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి.. చేసుకోవడానికి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=8RLLV9At58c