కాంగ్రెస్ పార్టీ జాబితాల విడుదల పూర్తయ్యేసరికి అసంతృప్తుల జాబితా కూడా పెరిగేట్టుగానే ఉంది. టిక్కెట్లు ఆశించేవారి నిరసనలు గాంధీభవన్ కు చేరుకున్న వైనం చూశాం. సీటు వస్తుందని భంగపడ్డవారిలో సర్లే సర్దుకుపోదామనే వైఖరి కంటే… ఈసారి ఏదో ఒకటి తేల్చుకోవాలనే ధోరణే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో రెబెల్స్ బెడద కాస్త ఎక్కువగానే ఉండేట్టు ఉంది. కాంగ్రెస్ నుంచి బీఫామ్ వస్తుందని చివరి క్షణం వరకూ ఎదురుచూసినవాళ్లు.. ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయ పార్టీలవైపు చూస్తున్న పరిస్థితి. తెరాస నుంచి కూడా ఇలాంటి అభ్యర్థులు కనిపిస్తున్నారు!
తెరాస నుంచి చెన్నూరు టిక్కెట్ కోసం చివరి వరకూ గట్టిగానే ప్రయత్నించారు మాజీ మంత్రి వినోద్. మంత్రి కేటీఆర్ దగ్గరకు చాలాసార్లు వెళ్లినా ఫలితం లేకపోయింది. అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని తెరాస తేల్చేసింది. చెన్నూరు సాధ్యం కాకపోతే బెల్లంపల్లి సీటైనా ఇవ్వాలంటూ చేసిన ప్రయత్నాలు కూడా వర్కౌట్ కాలేదు. ఆ తరువాత, కాంగ్రెస్ పార్టీ నుంచి సీటుకు ట్రై చేశారు. చివరికి ఇప్పుడు బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. ఇదే బాటలో మరికొంతమంది రెబెల్స్ కూడా బీఎస్పీ కార్యాలయానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, తెరాసలు కాదంటే.. భాజపా, బీఎస్పీ, ఎన్సీపీ, ఫార్వార్డ్ బ్లాక్ వంటి పార్టీలు చాలా ఉన్నాయి. రెబెల్స్ లో ఎక్కువ మంది భాజపావైపు మొగ్గు చూపే అవకాశం బాగా తక్కువగా ఉంది.
ఇక, బీఎస్పీ పార్టీయే ఎందుకంటే… గత ఎన్నికల్లో బీఎస్పీ రెండు స్థానాలు దక్కించుకుంది. పైగా, జాతీయ పార్టీ అనే గుర్తింపు ఒకటుంది. ఇది దళితులు, బలహీన వర్గాలు పార్టీగా పేరు ఉండటంతో ప్రచారం సులువు అనేది ఆశావహుల నమ్మకం. ఇంకోటి… స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగితే పార్టీ పేరంటూ ఉండదు, ఏ గుర్తు వస్తుందో తెలియని పరిస్థితి. దాని బదులుగా బీఎస్పీ లాంటి పార్టీ అండతో దిగితే… మాయావతి ప్రచారానికి వచ్చే అవకాశాలూ ఉంటాయి, దాంతో జాతీయ స్థాయిలో కొంత అటెన్షన్ కూడా ఉంటుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్లా గెలిచారు కాబట్టి, ఈసారి రెబెల్స్ లో ఎక్కువమంది అటువైపు చూస్తున్నట్టు సమాచారం. గాంధీభవన్ దగ్గర ధర్నా చేసిన కొంతమంది నేతలే ఆఫ్ ద రికార్డ్ బీఎస్పీ ప్రస్థావన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఆఫీస్ కి వెళ్లి, బీఫామ్స్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.