జయశాంతి.. ఏ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారో ఎవరూ చెప్పలేదు. ఆమె తమిళనాడులో.. కనిపిస్తే.. టీటీవీ దినకరన్ పార్టీలో ఉన్నారనుకుంటారు. హైదరాబాద్‌లో కనిపిస్తే తెలంగాణలో ఉన్నారనుకుంటారు. గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి… ఘోరపరాజయం పాలవడంతో… మళ్లీ కనిపించడం మానేశారు. పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. కానీ… జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు… చనిపోయిన తర్వాత మాత్రం అక్కడ కాస్తంత హడావుడి చేశారు. శశికళకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు. పరప్పణ అగ్రహారం జైలుకు వెళ్లి రెండు, మూడు ములాఖత్‌లు కూడా జరిపారు. ఆర్కేపురంలో టీటీవీ దినకరన్ తరపున ప్రచారం కూడా చేసినట్లున్నారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో సెటిల్ అవుతారేమో అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మళ్లీ తెలంగాణ క్యాంప్‌కు వచ్చేశారు.
కొద్ది రోజుల కిందట… ఆమె రాహుల్ గాంధీని కలిసినట్లు… ఆమెకు కీలక పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఢిల్లీలో ఆమె రాహుల్ గాంధీని కలిశారు కానీ… ఆమె పదవి గురించి మాత్రం.. ఏ కథా బయటకు రాలేదు. తనను ప్రచార కమిటీ చైర్మన్‌గా చేయబోతున్నారని… రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానన్నట్లుగా.. మీడియాకు లీకులిచ్చారు. తీరా… పదవుల పంపకం లిస్ట్ బయటకు వచ్చే సరికి.. ఆమెకు ఒక్కదాంట్లోనూ చోటు దక్కలేదు. కానీ.. స్టార్ క్యాంపెయినర్ అనే ట్యాగ్ లైన్ మాత్రం ఇచ్చారు. ఈ స్టార్ క్యాంపెయినర్లు.. ఎన్నికల సంఘానికి ఇచ్చే జాబితాకు తప్ప.. మరో దానికి ఉపయోగపడరు. అంతకు ముందు.. విజయశాంతి ఇంటికి వెళ్లి ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, శ్రీనివాసన్ చర్చలు జరిపారు. పార్టీలో చురుగ్గా పని చేయాలని కోరినట్లు వారు చెప్పుకున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత .. పార్టీనే అంటి పెట్టుకుని నేతలు పని చేసుకుంటున్నారు. వాళ్లంతా.. పార్టీని మళ్లీ ఎలాగోలా గెలిపిద్దామని.. టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే.. మహాకూటమి కట్టాలని.. ఓట్లు చీలకుండా.. చూసుకోవాలని తాపత్రయ పడుతున్నారు. కానీ.. నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ.. పార్టీ వైపే చూడని.. రాములమ్మ.. టీడీపీతో పొత్తు వద్దనే సంస్థాగత విషయాలపై… అసంతృప్తి వ్యక్తం చేసేస్తూ.. మీడియాకు లీకులిస్తున్నారు. అసంతృప్తి వాదులకైతే మంచి పబ్లిసిటీ వస్తుందని.. ఆమె అనుకుంటున్నారేమో…? కానీ.. ఇప్పుడామెను కాంగ్రెస్ పూర్తిగా లైట్ తీసుకున్నట్లయింది. రేపు పోటీ చేస్తానన్నా.. ఎక్కడా టిక్కెట్ ఇచ్చే అవకాశం కూడా ఉండవకపోవచ్చు.