” ఎక్కడో అంతరిక్షంలో ఉన్న గ్రహాల్ని భూమి మీద నుంచి మేనేజ్ చేసినప్పుడు… పక్కనే ఉన్న ఈవీఎంలను మేనేజ్ చేయలేమా…?” .. ఇదేదో లాజిక్కే అనిపించేలా ఉన్న ఈ మాట అన్నది సాక్షాత్తూ… కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తన విజయంపై తనకు అనుమానం వచ్చి ఈ వ్యాఖ్యలు చేయలేదు కానీ.. గతంలో.. ఎన్నికల్లో మంచి ఫలితాలు రానప్పుడు.. చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ తమ ఓటమికి కారణం.. ఈవీఎంలేనని గట్టిగా నమ్ముతోంది. అందుకే… ఇలాంటివన్నీ బయటకు తీసి… ప్రచారంలోకి పెడుతోంది. ఆ పార్టీ నేతలు రోజూ ప్రెస్మీట్లు పెట్టి … పదే పదే తమ అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.
గాంధీభవన్‌లో గురువారం యువ నేతలు మీడియా సమావేశం పెట్టి… ఈవీఎంల ట్యాంపరింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. సాంకేతికంగా ట్యాంపరింగ్‌కు అవకాశాలు ఉన్నాయని… గతంలో కేసీఆర్ కూడా అంగీకరించారని చెబుతున్నారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు తమ నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ చేస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలనేది వీరి ప్రధానమైన డిమాండ్. కేసీఆర్ కుటుంబ సభ్యుల ట్విట్టర్, వాట్సాప్, ఫోన్ కాల్స్ డేటా తీయాలని.. కేటీఆర్‌కు లైడిటెక్టర్ టెస్ట్ చేస్తే క్షణాల్లో వాస్తవం బయట పడుతుందని వీరు అంటున్నారు. టీఆర్ఎస్ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని… ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచారని దాసోజు శ్రావణ్ చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్కు పాలేరుగా మారి… 22 లక్షల ఓట్లు తొలగించారు…మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్నారు. ఓట్ల తొలగింపుపై క్షమాపణ చెప్పడానికి రజత్ కుమార్‌కు సిగ్గుండాలని మండి పడుతున్నారు. రజత్‌కుమార్ కు లై డిటెక్టర్ పరీక్ష చేయాలనేది… శ్రవణ్ డిమాండ్.
అంతిమంగా ప్రజలను తమను ఓడించలేదన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈవీఎంలతో ప్రజలను ఓడించారనేది వీరి అభిప్రాయం. అన్ని చోట్లా కాకుండా.. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని.. తుంగతుర్తి నుంచి ఓడిపోయిన అద్దంకి దయాకర్ అంటున్నారు. తుంగతుర్తిలో పోలైన ఓట్ల కంటే 1056 ఓట్లు ఎక్కువగా ఉన్నాయని.. అవి ఎలా వచ్చాయనేది వారి వాదన. ప్రజలు మా వైపు…ఈవీఎంలు టీఆర్ఎస్ వైపు ఉన్నారంటున్నారు. ఇంతటితో కాంగ్రెస్ నేతలు ఈ పోరాటాన్ని ఆపాలనుకోవడం లేదు.. న్యాయస్థానానికి వెళ్లాలనుకుంటున్నారు. అక్కడైనా వీరికి ఊరట లభిస్తుందా..?