కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వాలను తెలంగాణ స్పీకర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరిని ఎమ్మెల్యేలుగా పునరుద్ధరించాలని కూడా కోర్టు చెప్పింది. దానిపై ఇంతవరకూ స్పీకర్ స్పందించిందే లేదు. ఈ నేపథ్యంలో వారిద్దరి సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలంటూ స్పీకర్ ను కాంగ్రెస్ నేతలు కోరారు. సీఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు స్పీకర్ ను కలిసి, సభ్యత్వ రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని కోరారు.
అనంతరం, జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. తీర్పు వచ్చి యాభై రోజులు దాటుతున్నా కూడా స్పీకర్ పట్టించుకోలేకపోవడం దారుణమని మండిపడ్డారు. వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. అయితే, తమ డిమాండ్ పై స్పీకర్ స్పందించారనీ, పరుధులూ అవకాశాలను చూసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారన్నారు. ఇకపై ఈ అంశాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లబోతున్నట్టు ఉత్తమ్ చెప్పారు. ఏఐసీసీ తరఫున రాష్ట్రపతి దగ్గరకి వెళ్లి, ఈ పరిస్థితిపై ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణలో పరిస్థితిని జాతీయ మీడియాకి కూడా వివరిస్తామని ఉత్తమ్ అన్నారు.
నిజానికి, గడచిన రెండు సీఎల్పీ భేటీల్లో ఇదే అంశం చర్చనీయమైన సంగతి తెలిసిందే. తమ సభ్యత్వాల రద్దు విషయంలో టీపీసీసీగానీ, సీఎల్పీగానీ సరిగా స్పందించి పోరాటం చేయలేకపోతున్నారంటూ కోటిరెడ్డి, సంపత్ లు సొంత పార్టీ తీరుపైనే మండిపడిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు అమలుపై పోరాటం చేయాలంటూ వారే సొంత నేతల్ని నిలదీసిన పరిస్థితి. దీంతో సభ్యత్వాల రద్దు అంశంపై పోరాడాలనే ఏకాభిప్రాయం రెండ్రోజుల కిందటే టి. కాంగ్రెస్ ల కలిగింది! దాని ఫలితమే.. ఇవాళ్ల స్పీకర్ ని కలవడం, ఢిల్లీ వరకూ వెళ్తామనంటూ ప్రకటనలు చేయడం. కోర్టు తీర్పు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇదే అంశమై తెరాసపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కాంగ్రెస్ ఇంతవరకూ సరిగా చెయ్యలేదనే చెప్పాలి. ఆ మధ్య ఓసారి గవర్నర్ దగ్గరకి వెళ్లారు, అంతకుముందు ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఇన్నాళ్లకు, ఢిల్లీ స్థాయి పోరాటం అంటున్నారు! కనీసం ఇప్పుడైనా ఈ ఊపును కొనసాగిస్తారో లేదో చూడాలి.