మంత్రి పదవులు అడిగితే టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇస్తోంది హైకమాండ్. మంత్రివర్గం కన్నా ముందు పార్టీ పదవుల్ని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని నిర్ణయించారు. ఎస్సీ,ఎస్టీ, రెడ్డి, ముస్లిం సామాజికవర్గాల నేతలకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే పార్టీలోని ఇతర పదవుల భర్తీపైనా ప్రకటన చేయనున్నారు. కానీ మంత్రి వర్గ విస్తరణకు మాత్రం హైమాండ్ ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంక తన చేతుల్లో ఏమీ లేదని.. తేల్చేశారు. హైకమాండ్ నిర్ణయం మేరకే అంతా జరుగుతుందని .. తాను ఎలాంటి జాబితాను కూడా ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. అంటే ప్రయత్నాలు చేసి చేసి రేవంత్ కూడా అలసిపోయారు. ఢిల్లీ వెళ్తున్నారు..కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తున్నారు కానీ రాహుల్ ను మాత్రం రేవంత్ కలవలేకపోతున్నారు. దీంతో ఆయనకు రాహుల్ కు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని పూడ్చడానికి అయినా ఓ సారి రాహుల్ తో భేటీ కావాలని రేవంత్ అనుకుంటున్నారు.
అయితే ఈ సారి కూడా భేటీకి అవకాశం లేదని తెలుస్తోంది. తమ మధ్య గ్యాప్ లేదని.. రాహుల్ అపాయింట్ మెంట్ అడగలేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా పూర్తి స్థాయిలో మంత్రి పదవుల్ని భర్తీ చేసుకోలేకపోవడం ఆ పార్టీలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పాలనపై ప్రభావం పడుతోందన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నా.. హైకమాండ్ ఇదే పద్దతిలో ఉంది.