కాంగ్రెస్ పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉంది. బుజ్జగించిన వాళ్లందర్నీ బుజ్జగించి మాట వినని వాళ్లపై వేటు వేసింది. ఏకంగా ఇరవై నాలుగు మంది నేతలపై ఆరేళ్ల పాటు బహిష్కరించింది. వీరందరూ రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నవారే. ఒకరిద్దరు… ఇతర అభ్యర్థులకు మద్దతు ప్రకటించి పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న కారణంగా పార్టీ నుంచి తొలగించారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చావో రేవో అన్నట్లుగా తీసుకుంది. ప్రతి చిన్న అంశంపైనా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన వారిని బుజ్జగించి వారిలో చాలామంది నామినేషన్ల ఉపసంహరించుకొనేలా చేశారు. మాట వినని వారపై వేటు వేశారు.
అయితే ఈ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ… ప్రజాకూటమి అభ్యర్థుల ప్రయోజనాలను పట్టించుకోలేదు. సొంత పార్టీ అభ్యర్థులపై నిలబడిన వారిపై వేటు వేసినా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో… బీఎస్పీ తరపున నిలబడిన మల్ రెడ్డి రంగారెడ్డి విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మల్ రెడ్డి రంగారెడ్డి… అక్కడ తానే అధికారిక అభ్యర్థినని ప్రచారం చేసుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం లేదని.. తనకే మద్దతు ఇస్తున్నారని.. ప్రచారం చేస్తున్నారు. దానికి బలం చేకూర్చేలా. బహిష్కరించిన జాబితాలో మల్ రెడ్డి పేరు లేదు.
మరో వైపు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా.. రెబల్స్ విషయంలో తుది నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లోనూ.. కేటీఆర్ బుజ్జగించినా.. వెనక్కి తగ్గని నేతలు ఇరవై మంది వరకూ ఉన్నారు. వారిలో కొందరు సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు. వీరి వల్ల టీఆర్ఎస్ ఓట్లకు గండి పడే ప్రమాదం ఉండటంతో.. చివరిసారిగా మరో సారి నచ్చ చెప్పి.. పోటీ నుంచి విరమణ ప్రకటన చేసేలా చూడాలని భావిస్తున్నారు. అప్పటికీ మాట వినకపోతే.. వేటు వేయడానికి టీఆర్ఎస్ నాయకత్వం రెడీ అయిపోతోందన్న ప్రచారం జరుగుతోంది. కనీసం ఇరవై మంది నేతలపై.. టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది.