ఓ వైపు కోవర్టు నేతల వెన్నుపోట్లు.. మరో వైపు సీనియర్ల సొంత రాజకీయాలు.. మరో వైపు ఆర్థిక కష్టాలు వెరసి.. తెలంగాణ కాంగ్రెస్ చిక్కి శల్యమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ దాదాపుగా రెండు వారాలపాటు పాదయాత్ర చేయడానికి తెలంగాణలో ఉండనున్నారు. ఈ మూల నుంచి ఆ మూల వరకూ నడుస్తారు. ఆయన పాదయాత్ర కోసం తెలంగాణ కాంగ్రెస్ ఘనంగా సన్నాహాలు చేసుకుంది. 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
కొన్ని ప్రాంతాల్లో కార్నిర్ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధి రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగనున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో ఒకరోజు నైట్ హాల్ట్ చేయనుండగా నెక్లెస్ రోడ్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. నెక్లెస్ రోడ్ పాదయాత్రకు సోనియా, ప్రియాంకా గాంధీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్క రోజైనా పాదయాత్రలో పాల్గొనాలని.. గాంధీ కుటుంబ నేతలను తెంగాణ నేతలు కోరుతున్నారు.
రాహుల్ పాదయాత్రను అవకాశంగా చేసుకుని పార్టీని పునరుజ్జీవింప చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌కు బలపరిస్తే ఎక్కడ రేవంత్ బలపడతారోనని ఇతర నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే రాహుల్ ఎదుట బల ప్రదర్శన చేయడానికి వారు ప్రయత్నించే అవకాశాలున్నాయి. ఈ విధంగా అయినా పాదయాత్ర సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు. పాదాయత్ర స్ఫూర్తితో భవిష్యత్‌లో పోరాటం చేయాలని.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని పోరాడుతున్నారు. అయితే అది వారి చేతుల్లోనే ఉంది. కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించరు.. వాళ్లే ఓడించుకుంటారని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉంటారు మరి!