తెలంగాణ కాంగ్రెస్ లో హాత్ సే హాత్ జోడో పాదయాత్రలు స్పష్టమైన మార్పు తీసుకొస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీ అయిపోయారు. పాదయాత్రలతో నియోజకవర్గాలను చుట్టు ముట్టేస్తున్నారు. పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోవడంతో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలను అంతే సీరియస్గా చేస్తున్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఆయన వెంటనే వచ్చి పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కు వివరణ ఇచ్చారు. తాను కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రస్తుతానికి కోమటిరెడ్డిపై చర్యల విషయాన్ని పక్కన పెట్టారు. ఒక్క సారిగా హైకమాండ్ సీరియస్ కావడంతో నేతలంతా ఈ అంతర్గత రాజకీయాలను పక్కన పెట్టి పాదయాత్రల్లో బిజీ అయిపోయారు.
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పేరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు నుంచి పాదయాత్రకు శ్రీకారకం చుట్టి..రెండు నెలల పాటు జనంలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. రేవంత్రెడ్డి పాదయాత్రకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఇతర సీనియర్లు కూడా హాజరై సంఘీభావం చెప్పారు. సీనియర్ నేతల్లో మార్పు రావడంతో పాటు పార్టీ కేడర్లో కూడా నూతన జోష్ వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల ముం దు కు బలంగా తీసుకెళ్లితే తమకు అధికారం రావడం ఖాయమని.. ముందు పార్టీ గెలిస్తే..తర్వాత ప్రాధాన్యతలు.. పదవుల గురించి ఆలోచించవచ్చని అనుకుంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఈ మార్పు ఆ పార్టీ క్యాడర్ను సంతృప్తి పరుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఇప్పటికీ గట్టిగానే ఉంది. రేవంత్ రెడ్డి పాదయాత్రకు మీడియాలో అనుకున్నంతగా కవరేజీ రాకపోయినప్పటికీ ప్రజా స్పందన మాత్రం ఊహించని విధంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ పాదయాత్ర రాత మారుస్తుందన్న నమ్మకం పెరగడంతో.. సీనియర్లు కూడా ఆయనకు మద్దతుగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారంటున్నారు.