కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన సక్రమంగా చేయలేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినప్పుడు, పక్కనే ఉన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనని ఎందుకు నిలదీయలేదని తెలంగాణా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చాలా హడావుడిగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయడంవలన, రాష్ట్ర విభజన జరిగి సుమారు ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ నేటికీ రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఎప్పటికీ పరిష్కారం అయ్యేవి కావు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరిగి ఉండి ఉంటే ఇటువంటి సమస్యలు తలెత్తేవి కావు. ఇంతకు ముందు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలను విభజించింది. ఆ తరువాత వాటి మధ్య ఎన్నడూ ఒక్క సమస్య కూడా వచ్చినట్లు వార్తలు రాలేదు. ఎందుకంటే ఆ రాష్ట్రాలు శాస్త్రీయంగా విభజించబడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ అదే ఉద్దేశ్యం అన్నారే తప్ప తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకిస్తూ అన్నమాట కాదది. ఆ సంగతి షబ్బీర్ అలీకి కూడా తెలుసు. కానీ నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు కనుక ఏదో ప్రతివిమర్శ చేయాలి గాబట్టి షబ్బీర్ అలీ కూడా చేసినట్లున్నారు అంతే! నిజానికి రాష్ట్ర విభజన పట్ల తెరాస కూడా సంతృప్తి చెందలేదు. కానీ తాము కోరుకొన్నట్లుగా తెలంగాణా ఏర్పాటు అవుతోందనే ఏకైక కారణంతో సర్దుకుపోయింది. కాంగ్రెస్ చేసిన ఆ నిర్వాకం వలన ఆంధ్రా, తెలంగాణా ప్రజలకి, ప్రభుత్వాలు అనేక సమస్యలు, వివాదాలు ఎదుర్కోవలసి వస్తోంది. అందుకు అది సిగ్గుపడకపోగా ఆ తప్పులను ఎత్తి చూపినవారిపై ప్రతివిమర్శలు చేయడం చాల హాస్యాస్పదం.