కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇప్పుడు ఒకేసారిగా మంత్రి కేటీఆర్ మీద విమర్శలు, ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆరోపణల్ని ఇతర నేతలూ అందుకుని విమర్శిస్తున్నారు. 111 జీవో పరిధిలో ఉన్న నాలాను కేటీఆర్ కబ్జా చేశారనీ, దాని మీద ఫామ్ హౌస్ నిర్మించుకున్నారంటూ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వ్యక్తి చేయదగ్గ పనులు ఇవేనా అంటూ మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులందరూ కలిసి కేటీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నాకి దిగుతామనీ, పోలీసులు కేసులు పెట్టినా వెనకాడేది లేదన్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా అన్నారు షబ్బీర్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ… అక్రమ నిర్మాణాలకు రక్షకుడిని అని చెప్పుకునే కేటీఆర్, ఇవాళ్ల పురపాలక మంత్రిగా కొనసాగే నైతిక అర్హతను కోల్పోయారన్నారు. ఈ కబ్జాకోరు పనేంటని కేటీఆర్ ని ప్రశ్నిస్తే… లీజుకు తీసుకున్నామని తెరాస నేతలు తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతల ఫోకస్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కేటీఆర్ మీదకి ఒకేసారి మళ్లింది. ఎందుకని ఒకేసారి అందరూ కేటీఆర్ ని లక్ష్యంగా మార్చుకున్నారు..? అంటే, ఇది రాజకీయ వ్యూహాత్మక ఎదురుదాడిగానే కనిపిస్తోంది. కేటీఆర్ ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నంగానూ దీన్ని చూడొచ్చు. కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఈ మధ్య కొంతమంది మంత్రులే మాట్లాడారు. ఆ తరువాత, ఆ చర్చ సద్దుమణిగింది. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో రెండేళ్ల తరువాతైనా జరిగేది ఇదే! కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లాలనే వ్యూహంలో ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామంది సీనియర్ నాయకులు వారి వారసులకు రాజకీయాల్లో సుస్థిర స్థానం కల్పించేసి పక్కకి తప్పుకుంటున్నారు. తెరాసలో కూడా జరిగేది ఇదే. అధికారంలో ఉంటుండగానే తనయుడికి వాటిని బదలాయించాలని కేసీఆర్ భావించొచ్చు. దానికి అనుగుణంగానే మంత్రి కేటీఆర్ ని పార్టీలో ఇంతింతై అన్నట్టుగా సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేశారు.
వరుస ఎన్నికల్లో ఆయన సారథ్యంలోనే పార్టీ నడించింది. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కేటీఆర్ అత్యంత కీలకమని వేరే చెప్పాల్సిన పనిలేదు. సమీప భవిష్యత్తులో కేటీఆర్ కి కీలక బాధ్యతలు అప్పగించేలోగానే… ఆయనపై ఆరోపణలు విమర్శలు చేసి, ఇకపై మా పోరాటం కేటీఆర్ తో కూడా బలంగానే ఉంటుందనే సంకేతాలు ఇప్పట్నుంచీ ప్రజలకు ఇవ్వాలన్న వ్యూహం కాంగ్రెస్ నేతలకు ఉన్నట్టుగా అనిపిస్తోంది. కేటీఆర్ ని తెరాసలో సూపర్ పవర్ అని ఆ పార్టీలో ఇమేజ్ మరింత పెంచేలోగానే… ఇలాంటి ఆరోపణలూ విమర్శలూ చేయడం ద్వారా ఒకరకమైన చర్చను ప్రజల్లో అలా కొనసాగించొచ్చు అనేది టి. కాంగ్రెస్ వ్యూహం అనొచ్చు.