కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువే. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడినట్లు.. సొంత నేతలపై.. విమర్శలు గుప్పించుకుంటూ ఉంటారు. ఇలాంటి విమర్శలు చేయడంలో..ఒక్క పార్టీ అధ్యక్షుడికి మాత్రమే మినహాయింపునిస్తారు. పీసీసీ చీఫ్‌లను కూడావదిలి పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్య పరిణామాలు చాలా పీక్స్‌కు చేరిపోయాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉన్న పళంగా తొలగించాల్సిందేనంటూ.. సీనియర్ నేతలంతా..ఢిల్లీకి క్యూకట్టారు. వీరికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా అండగా నిలిచారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇప్పించారు. దాదాపుగా పది నిమిషాల పాటు.. భట్టి విక్రమార్క్, డీకే, రేవంత్ సహా.. అనేక మంది సీనియర్లు… ఉత్తమ్ కుమార్ రెడ్డిపై… రిపీట్ కాకుండా.. వరుసగా ఫిర్యాదులు వినిపించారు.
ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేస్తే అండగా నిలబడాల్సిన పీసీసీ చీఫ్ నిర్లిప్తంగా ఉన్నారని.. ఇది పార్టీకి చాలా చేటు చేసిందని కోమటిరెడ్డి రాహుల్ కు గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. ఉత్తమ్ పదవిలో ఉంటే.. కాంగ్రెస్ కు కనీసం పదిహేను అసెంబ్లీ సీట్లు కూడా రావని కుండ బద్దలు కొట్టారు. ఉత్తమ్ మినహా ఎవర్నీ ఉన్నత పదవిలో నియమించినా… కలసి పనిచేస్తామని రాహుల్ కు హామీ ఇచ్చారు. ఇంచార్జ్ కుంతియా సమక్షంలోనే ఉత్తమ్ పై నేతలంతా.. వరుసగా ఫిర్యాదులు చేశారు. అందరూ చెప్పిన మాటలు విన్న రాహుల్.. ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదట. రాహుల్ తో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడలేరు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శివుడు పెయింటింగ్ ని రాహుల్ గాంధీకి బహుకరించారు.
ఉత్తమ్ చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర సందర్భంగా… ప్రారంభమైన విబేధాలు.. ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరాయి. ప్రజాచైతన్య యాత్రలను బహిరంగ సభలుగా మార్చి…ఉత్తమ్ అనుకూల వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని నేతలంతా ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఉత్తమ్ పరోక్షంగా అభ్యర్థులను ప్రకటించటం, ఆ నేతలు సైతం ఉత్తమ్ ను సిఎం గా అభివర్ణించటంతో ఇతర సీనియర్ నేతలకు ఆగ్రహం తెప్పించింది. అంతకు ముందు నుంచే ఉత్తమ్ పై ఆగ్రహం ఉన్నా.. తాడోపేడో తేల్చుకోవాలని అప్పడే డిసైడ్ అయ్యారు.
సీనియర్ నేతలు ఢిల్లీలో రాహుల్ ను కలిసిన సమయంలోనే. .. హైదరాబాద్ గాంధీభవన్ లో…టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ధూమ్ థామ్ గా జరుపుకున్నారు. ఆయన సన్నిహిత నేతలంతా ఈ వేడుకలకు వచ్చారు. తనపై నాపై ఫిర్యాదు చేసేందుకు సీనియర్లు ఢిల్లీ వెళ్లారని అనుకోవడం లేదన్నారు. అయితే ఉత్తమ్ చూపిస్తున్నంత ధీమా… ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ లో లేదన్న భావన రాజకీయవర్గాల్లో ఉంది. త్వరలో పీసీసీని రాహుల్ గాంధీ పునర్ వ్యవస్థీకరిస్తారని… ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అది ఏ క్షణమైనా జరుగుతుందంటున్నారు. ఉత్తమ్ పోస్టు అప్పుడే ఉంటుందో.. ఊడుతుందో తేలుతుందంటున్నారు.