కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ..! రాక రాక ఒక మంచి అవకాశం వస్తే… దాన్నెందుకు వదులుకున్నారని భట్టి విక్రమార్కపై సొంత పార్టీకి చెందిన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుటే అధికార పార్టీ తీరు మీద పోరాటం చేసేందుకు కాంగ్రెస్ కి వచ్చే అవకాశాలే తక్కువ! అలా వచ్చిన దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే ఎలా అనే విమర్శలు ఇప్పుడు సొంత పార్టీ శ్రేణుల్లో చర్చనీయం అవుతున్నాయి.
ఇంతకీ, కాంగ్రెస్ నేతలకు వచ్చిన ఆ అవకాశం ఏంటంటే… అధికార పార్టీ తెరాస నుంచి వచ్చిన ఆహ్వానం! పట్టణ ప్రగతి ప్రణాళిక కోసం సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మొన్ననే జరిగింది. కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ఎలా ఉండాలో కూడా చర్చించారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కూడా తెరాస ఆహ్వానించింది. అయితే, దీనిపై ఎటూ తేల్చుకోలేక కాంగ్రెస్ పార్టీకి ఊగిసలాటకే సమయం సరిపోయింది. అధికార పార్టీ ఆహ్వానాన్ని ఎలా చూడాలి, వెళ్తే ఏమౌతుందని చర్చించడం కోసం ఎమ్మెల్యేలతో భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం సరైన పద్ధతిలో అందలేదనీ, ప్రగతి భవన్ కి చెందిన కిందిస్థాయి అధికారులతో ఫోన్ చేయించి ఆహ్వానించడం అవమానించడమే అన్నారట. ఇలాంటి ఆహ్వానానికి స్పందించి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన నిర్ద్వంద్వంగా కొట్టిపారేశారు.