తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేత షర్మిలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. డీకే శివకుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల సాయంతో తెలంగాణ కాంగ్రెస్ లో చక్రం తిప్పుదామని అనుకుంటున్నారు కానీ..ఆమె వల్ల ఒక్క ఓటు రాకపోగా.. ఇంకా మైనస్ అవుతుందని అసలు ఆమె నీడ పార్టీపైనే వద్దని మెజార్టీ తెలంగాణ నేతలు హైకమాండ్ కు తెల్చి చెబుతున్నారు. ఆమెకు ఏపీలో బాధ్యతలు ఇస్తే సహకరిస్తామని అంటున్నారు. కానీ షర్మిల మాత్రం తాను ఏపీకి పోయేది లేదని తెలంగాణలో రాజకీయం చేస్తానంటున్నారు.
షర్మిలకు తెలంగాణ రాజకీయం అసలు సరిపడదు. ఆమె మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా పట్టించుకున్న వారు లేరు. పాలేరులో పోటీ చేస్తానని అక్కడ హడావుడి చేసినా… ఆమె ఓ విగ్రహావిష్కరణ సభ పెట్టుకుంటే… రెండు వందల మంది కూలీల్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అసలు ఆమె ప్రభావం శూన్యమని… తెలంగాణ కాంగ్రెస్ నేతలకు.. హైకమాండ్ కు అర్థమయింది. అయినా షర్మిల ఏదో మిషన్ మీద ఉన్నట్లుగా…తెలంగాణ పార్టీలో విలీనం చేసుకోవాలని పట్టుబడుతున్నారు. అయితే హైకమాండ్.. తెలంగాణతో పాటు ఏపీలోనూ రాజకీయం చేస్తే నే సరే అంటోంది. లేకపోతే.. మీ దారి మీరు చూసుకోండని చెప్పి పంపేసింది.
ఇప్పుడు షర్మిల ముందు ఒకే ఆప్షన్ ఉంది. ఏపీలో రాజకీయాలు చేయడమా.. తెలంగాణలో చేయడమా. తెలంగాణలో చేయాలనుకుంటే.. తన పార్టీతో ఒంటరిగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. కనీసం అభ్యర్థుల్ని నిలబెట్టుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. తాను పోటీ చేసి గెలుస్తుందో తేలేదో తెలియదు. ఒక వేళ ఒక్క శాతం ఓట్లు కూడా రాకపోతే …ఏపీలోనూ రాజకీయ భవిష్యత్ ఉండదు. అదే కాంగ్రెస్ లో చేరితే.. తెలంగాణలో లేకపోయినా ఏపీలో నాయకురాలిగా ఎదిగే చాన్స్ ఉంటుంది. చాయిస్ ఆమె చేతుల్లోనే ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.