తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంత మంది నేతలు తమ విధేయతను ప్రదర్శించుకోవడానికి .. పార్టీకి సాయం అందిస్తున్నట్లుగా చూపించుకోవడానికి నేషనల్ హెరాల్డ్ ను నడిపే యంగ్ ఇండియా సంస్థకు విరాళిచ్చేవారు. అధికారంలో ఉన్న సమయంలో కావడంతో ఇవి పెద్ద మొత్తంలోనే ఉండేవి. అప్పట్లో మంత్రి పదవులు.. ఇతర ప్రయోజనాలు పొందిన వారు పెద్ద ఎత్తున ఇలా విరాళిచ్చారు. వారంతా ఇప్పుడు మాజీలైపోయారు. కానీ అలా విరాళిచ్చినందుకు ఇప్పుడు ఈడీ ఎదుట హాజరు కావాల్సి వస్తోంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా ప్రశ్నించిన ఈడీ అధికారులు ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టారు. ఐదుగురు సీనియర్ నేతలకు నోటీసులు ఇచ్చారు. వీరిలో షబ్బీర్ అలీ, గీతారెడ్డి లాంటి నేతలున్నారు. నోటీసులిచ్చినప్పుడు కాకుండా ఒకరి తర్వాత ఒకరు హాజరవుతున్నారు. అయితే ఇలా నేషనల్ హెరాల్డ్‌కు విరాళాలు ఇచ్చిన వారిలో వందల మంది కాంగ్రెస్ నేతలు అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు.
కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలను మాత్రమే టార్గెట్ చేశారు. వారికి మాత్రమే నోటీసులు ఇవ్వడంతో .. బీజేపీలో చేర్పించేందుకు నాటకాలాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే తాము విరాళిచ్చిన దాంట్లో రహస్యమేమీ లేదని వెళ్లి సమాధానం చెప్పి వస్తామని నేతలు ధైర్యంగా చెబుతున్నారు. వారికి ఏఐసీసీ తరపున కొంత మంది న్యాయనిపుణులు సహకారం అందిస్తున్నారు.