ఆంధ్రప్రదేశ్ లో పార్టీని త్యాగం చేసి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని టి. కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారనీ ప్రచారం చేసుకుంటారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో.. నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, కేసీఆర్ పై విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ వ్యూహరచనలు చేస్తోంది. రాష్ట్రస్థాయిలో రేవంత్ రెడ్డి లాంటి నాయకుల్ని పార్టీలో చేర్చుకుంది. తెరాస నుంచి కూడా కనీసం ఒకటో రెండో వలసలు ప్రోత్సహిస్తే.. తాము బలపడుతున్నామని మరింత బలంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుందనే వ్యూహంతో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, బలం అనేది పైస్థాయి నేతల్లో ఉంటే సరిపోతుందా..? నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టేశాం అని చెప్పుకున్నంత మాత్రాన పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తే సరిపోతుందా..? ఈ నాయకులంతా హైదరాబాద్ లో కూర్చుంటే.. కిందిస్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటీ..? ఇందిరా గాంధీ శతజయంతి సందర్భంగా చాలాచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు! పార్టీ సీనియర్ల ముందే కేడర్ బాహాబాహీకి దిగడం విశేషం.
ఆదిలాబాద్ లో జరిగిన ఇందిరా గాంధీ శతజయంతి కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు హాజరయ్యారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, పీసీసీ కార్యదర్శి సుజాత వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వీహెచ్ సమక్షంలో తోపులాటకు దిగారు. ఆయన సమక్షంలో విమర్శలు గుప్పించారు. దీంతో వీహెచ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన కూడా సహనం కోల్పోయి… కార్యక్రమం పూర్తవకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవడం విశేషం. ఇదొక్కటే కాదు… మంచిర్యాలలో కూడా ప్రోటోకాల్ రగడ జరిగింది. బెల్లంపల్లిలో కూడా స్థానిక నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవలకు దిగారు. వివిధ మండల స్థాయి కార్యక్రమాల్లో కూడా ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని కాంగ్రెస్ వర్గీయులే చెబుతున్నారు.
ఇందిరా గాంధీ శతజయంతి సందర్భంగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడదామనుకుంటే… ఇలా కేడర్ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. అంటే, వాస్తవ పరిస్థితి ఇదన్నమాట. పార్టీని బలోపేతం చేసేస్తున్నాం… అని హైదరాబాద్ లో కూర్చుకుని హైకమాండ్ కు నివేదికలు పంపించే నాయకులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అంశం ఇదే! క్షేత్రస్థాయిలో చాలా అసంతృప్తులున్నాయి. పై స్థాయి నేతలు చేతులు కలుపుకుని కలుపుగోలుగా ఉన్నామని సంకేతాలు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. కిందిస్థాయిలో ఉన్న విభేదాలకు చెక్ పెట్టాల్సి ఉంది. మరి, ఇందిర శతజయంతి సందర్భంగా బయటపడ్డ కేడర్ అసంతృప్తిని పార్టీ నేతలు విధంగా చూస్తారో..?