తెలంగాణ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న నేతలు రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టిపోతున్నారు. వారి బాధ.. ఆవేశం అన్నీ ఆయన వచ్చిన తర్వాత తమకు ప్రాధాన్యం లేదనే బాధే. తమకు రావాల్సిన స్థానాలను రేవంత్ లాక్కున్నారన్న బాధ కొందరిది.. సర్వేల పేరుతో టిక్కెట్లు ఇవ్వట్లేదనే ఆవేదన మరికొందరిది. ఇతర పార్టీల్లో అయితే చాన్స్ వస్తుంది కదా అని.. తమ రేంజ్లో ప్రతాపం చూపించి వెళ్తున్నారు. అయితే వారంతా రేవంత్‌కు మేలు చేస్తున్నారా ? కీడు చేస్తున్నారా ? అంటే.. బయటకు ఆయనపై దాడి చేస్తున్నామని అనుకుంటారు కానీ.. వారు చేస్తోంది మాత్రం రాజకీయంగా మేలే.
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కీలక నేత. ఆయన వ్యతిరేక వర్గం కూడా బలంగానే ఉంది. వారంతా సీనియర్లు. అయితే వారంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. బయటకు వెళ్లినా తాము నిలబడగమనుకున్న నేతలు .. ధైర్యం చేస్తున్నారు. చాన్సులు రావనుకున్న వారూ వెళ్లిపోతున్నారు. వారు వెళ్లిపోవడం వల్ల రేవంత్‌లో పార్టీలో ఎదురు లేకుండా పోతుంది. ఎవరూ నోరెత్తలేదు. అంటే పార్టీ ఆయన గుప్పిట్లోకి వెళ్లిపోతోంది. ఇప్పటికే అది జరుగుతోంది. ఇంకా జగ్గారెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు ఉన్నారు. వారూ రేపోమాపో బయటకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమిత్ షాతో భేటీ కావడం.. ఆయన కూడా బీజేపీలో చేరికపై ఆసక్తి చూపడంతో.. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీలో ఉన్నా లేనట్లే. అయన పార్టీ నుంచి వెళ్లడం ఖాయం. ఇప్పుడురేవంత్ రెడ్డికి ఎదురు లేకుండా పోయింది. ఇంతకు ముందు నల్లగొండ జిల్లాలో అడుగు పెట్టాలంటే రేవంత్ సంకోచించేవారు. కానీ ఇప్పుడు బహిరంగసభ పెట్టి ఆ లీడర్లు లేకపోయినా వచ్చే జనానికి లోటేమీ ఉండదని నిరూపించారు. చండూరు సభను పెట్టాలని మూడు రోజుల్లో నిర్ణయించి.. అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం రేవంత్ కే సాధ్యమయింది.
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో ఇద్దరు ముగ్గురు నుంచి చికాకులు తప్పకపోవచ్చు. కానీ మిగతా పార్టీ అంతా తప్పనిసరిగా రేవంత్ నాయకత్వాన్ని బలపర్చాల్సిందే. రేవంత్‌కు పోటీగా ఉంటాలనుకున్న నేతలంతా పార్టీకి గుడ్ బై చెబుతున్నందున ఆయనకు కాంగ్రెస్‌లో తిరుగు లేకుండా పోతుంది. ఇది రేవంత్‌కు మేలు చేయడమే అవుతుంది.