పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణపై మరోసారి దృష్టి సారించింది కాంగ్రెస్ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న తరువాత, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కొరవడిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్ని టి. కాంగ్రెస్ పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల వైఫల్యాలపై కూడా సమగ్రమైన చర్చ ఇంతవరకూ పార్టీలో జరగలేదనే చెప్పాలి. అయితే, ఈ అంశాన్నీ మంగళవారం ఢిల్లీలో అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో చర్చకు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాహుల్ తో భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులు, అనుసరించాల్సిన ప్రచార వ్యూహంతోపాటు, అసెంబ్లీ ఎన్నికల వైఫల్యంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.
రాష్ట్ర పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ తో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే నష్టపోయామని పొంగులేటి చెప్పినట్టు సమాచారం. అమేథీతోపాటు ఖమ్మం నుంచి కూడా ఎంపీగా రాహుల్ ని పోటీ చేయాలని పొంగులేటి కోరారు. అయితే, దానిపై చూద్దాం అని మాత్రమే రాహుల్ స్పందించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఓటమికి కారణం కేసీఆర్ అమలు చేసిన పథకాలే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. సీట్ల కేటాయింపు వ్యవహారం ఆలస్యం కావడంతో ప్రచారానికి సరైన సమయం లేకుండా పోవడం కూడా ఓటమికి కారణమనే అభిప్రాయం ఈ చర్చలో టీ నేతలు వ్యక్తీకరించినట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో ఎదురైన ఇబ్బందుల్ని అధిగమించి, పార్లమెంటు ఎన్నికల్లో పోరాటం చేస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా చెప్పారు. దీనికి సంబంధించిన వ్యూహాలపై కూడా చర్చించామంటూ ఆయన అన్నారు. పొత్తుల విషయానికి వచ్చేసరికి… రాష్ట్ర స్థాయిల్లో ఒకలా, జాతీయ స్థాయిలో మరోలా ఉంటాయని కుంతియా చెప్పారు. అయితే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లోక్ సభ ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయనేది ఇంకా కాంగ్రెస్ అధిష్టానానికే స్పష్టత రానట్టుగా ఉంది. ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ది ఒంటరి పోరాటమని స్పష్టమైపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీతో కలిసి వెళ్లే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. అలాగని, జాతీయ రాజకీయాలకు వచ్చేసరికి… భాజపాయేతర పక్షాల్లో భాగంగా టీడీపీతో కలిసి పనిచెయ్యాలి. అంటే, లోక్ సభ ఎన్నికల్లో పొత్తుల ఉంటే ఎలా ఉంటాయి, లేకపోతే ఏంటనేది కాంగ్రెస్ ఇంకా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది.