తెలంగాణ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో అధికారానికి రావాలని గట్టిగానే తంటాలు పడుతున్నది. ఇందుకోసం అటు అధిష్టానం ఇటు పిసిసినాయకత్వం కూడా రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. అందులో ముఖ్యమైంది టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను తేల్చిపారేయడం ఇవన్నీ గతంలో మేము చేసినవేనని చెప్పడం.. ఇది వూరికే చెబితే కుదరదు గనక సాక్ష్యాధారాలతో పోటోలతో కూడిన పవర్‌పాయింట్ ప్రెజంటేషన్లు ఇవ్వడం.ప్రాజెక్టులపై ఉత్తమ కుమార్ రెడ్డి శ్రావణ్ఇచ్చిన పిపిపిలతో ఇది మొదలైంది. ఇటీవల విద్యుత్‌పైన ఇచ్చారు. తాజాగా తాను పెన్షన్లపై అధ్యయనం చేసి ప్రెజంటేషన్ తయారు చేశానని ఒకయువ నాయకురాలు చెప్పారు. టి.కాంగ్రెస్‌లో జానారెడ్డి, పొన్నాల, కోమటిరెడ్డి బ్రదర్స్ వంటివారు అసంతృప్తిగా వున్నా ఉత్తమ్ యువ నేతలను ముందుంచుకుని జైపాల్‌రెడ్డి వంటివారి ఆశీస్సులతో ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. మల్లురవి భట్టి విక్రమార్క, విహెచ్ లాటివారు కూడా ఏదో మేరకు సహకరిస్తున్నారు. ఈ మధ్యనే ఏపూరి సోమన్నకు సహాయమందించి ఒక కళాబృందం ఏర్పాటు చేయించారు. జెఎసి కోదండరాంతో నిరంతరం టచ్‌లో వుంటున్నారు. జనవరి చివరిలోగా పార్టీ పెట్టాలని కోదండ నిర్ణయించినట్టే. జెఎసిలాగే వుంటే తమను ఎవరూ ఖాతరు చేయరని పార్టీగా వస్తే కొన్ని హక్కులు కలుగుతాయని ఆయన భావిస్తున్నారట. ప్రస్తుత జెఎసిలో 90 శాతం అలోచన అదే అంటున్నారు. కోదండ తమ పార్టీలో కలవకపోతే పార్టీగా ఏర్పడ్డం మంచిదని కాంగ్రెస్ కూడాకోరుకుంటున్నది. ఈ వ్యూహాల వూపులోనే టికాంగ్రెస్ నేతలు అనూహ్యమైన రీతిలో గవర్నర్ నరసింహన్‌తో కూడా ఘర్షణ పడి వచ్చారు. రేవంత్ రెడ్డిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మరో కసరత్తుగా వుంది. పాతకాపుల్లో డికె అరుణ వంటివారికి ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిందే. ఇవన్నీ సర్దుకుని సమరానికి సిద్ధం కావడమే సవాలుగా వుంది. ఈ లోగా టిఆర్ఎస్ మంత్రులు నేతలూ ఎక్కడ మాట్లాడినా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ మిగిలిన వారిని దాదాపు మరుగుపరుస్తున్నారు. పైగాగతంలో పాలన చేసిన కాంగ్రెస్‌ను విమర్శించడానికి ఎన్నో కారణాలు దొరుకుతాయి. దేనికీ వారి బాధ్యత తప్పించుకోలేరు. చర్చలలో కూడా అదే వారు ఇబ్బంది పడుతుంటారు. లేదంటే ఎదురు దాడి చేస్తారు.